యథావాక్కుల అన్నమయ్య
ప్రాచీనులగు శివకవులలో యథావాక్కుల అన్నమయ్య యొకఁడు. ఇతcడు "సర్వేశ్వరా " అను మకుటముతో శివస్తుతి నొనరించుచు నొక కృతిని రచించెను. అది "సర్వేశ్వర శతకము"గా ప్రసిద్దమైయున్నది. ఇందలి పద్యసంఖ్య వివిధములగు వ్రాతప్రతులలో విభిన్నముగ నున్నది కొన్నింట 123 కొన్నింట 133. పరిషత్తు వారు ముద్రించిన ప్రతిలో 128 పద్యములు, మఱికొన్నింట 142 పద్యములను కానవచ్చుచున్నవి. ఇందలి పద్యములు కొన్ని యితర గ్రంథములందును (అబ్బయామాత్యుని కవిరాజమనోరంజనమునను కలదు. ప్రబంధ రత్నావళియందు, మమ్మయ జైతరాజు రచనగా నొకపద్యముకలదు ) కానవచ్చుచున్నవి. ఇతరులు పై మకుటముతో వ్రాసిన పద్యములు కొన్ని యిందుఁజేరినట్లు విమర్శకు లభిప్రాయపడుచున్నారు. కావున ఇందలి పద్యసంఖ్యను నిర్ణయించుట కష్టము. కవి, తాను శతకమును వ్రాసితినని చెప్పనందున-ఇది శతక మగునో, కాదో నిర్ణయించుటయు కష్టము. అన్నమయ్య తాను 'సర్వేశ్వర ప్రాకామ్యస్తవము'ను జెప్పినట్లును. 'సర్వేశ్వరస్తోత్రంబు' చెప్పినట్లును తెల్పియున్నాఁడు. మఱియు 'సర్వేశ్వర స్తోత్రం బన్నయచెప్పె' నను పద్యభాగమునుబట్టి యితనికి 'అన్నయ" అను పేరు నున్నట్లు స్పష్టము.
"శాకాబ్దంబులు వార్థి షట్కపురజి
త్సం ఖ్యం బ్రవర్తింప
శ్లోకానందకరంబుగా మహిమతో
శోభిల్ల సర్వేశ్వర
ప్రాకామ్య స్తవ మొప్పఁ జెప్పె శుభకృ
త్ప్రవ్యక్తవర్షంబునన్
శ్రీకంఠార్పితమై వసుంధరపయిం
జెన్నొంద సర్వేశ్వరా!"