Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అను నీతని పద్యమునుబట్టి యేతద్గ్రంథరచనాకాలము 1164 నకు సరి యగు క్రీ.శ.1242 గా తెలియుచున్నది.

ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన 'సర్వేశ్వర శతక' పీఠికనుబట్టి యీ యన్నమయ్య ఆత్రేయసగోత్రుఁడగు నారాధ్యబ్రాహ్మణుఁడనియు, యజుశ్శాఖాధ్యాయి యనియు, గోదావరీ తీరవాసియనియు, పట్టెసమున వెలసిన వీరభద్రేశ్వరస్వామి యీతని యిలవేలుపనియుఁ దెలియుచున్నది. ఈ వృత్తాంతము పరిషత్తువారికి శ్రీ శేషగిరిరావుగారు సంపాదించి యిచ్చినట్లును సోమరాజు వేంకట శివునిచే వ్రాసియుంచఁబడినట్లును తెలియు చున్నది.

అన్నమయ్య ప్రాచీనుఁ డగుటచే "సమూహి, విగర్వించు, సురంగము, బహురూపమాడు" మున్నగు పదములను ప్రయోగించెననియు, ఇట్టివి సోమనాథాదుల గ్రంథములందును గలవనియు "తెనుఁగు కవుల చరిత్ర"లోఁ గలదు.

పెక్కు విషయములలో అన్నమయ్య కృతికిని, సోమనాధుని గ్రంథములకును పోలిక కానవచ్చుచున్నది. సోమనాధుఁడు క్రీ. శ. 1190-1260 ల నడుమ నుండెనని నిశ్చయించిన శ్రీ వేంకటరావుగారు సోమనాధు ననుసరించియే అన్నమయ్య గ్రంథరచన సాగించెననియు, అన్నమయ్య అతి రమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వర, ప్రభుకారుణ్య వసంతసంజనితమత్సద్య ప్రసూనావళిన్"--అనునెడ పేర్కొనిన దూది కొండలోని ఆరాధ్య సోమేశ్వరుఁడు పాలకుఱికి సోమనాధుఁడే యయి యుండుననియు తెలియజేసియున్నారు.

సోమనాధుఁడు ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమున నుండెనని తలఁచుచున్న *ఆంధ్రకవితరంగిణి" కర్త 'శతకవాఙ్మయ సర్వస్వ' కర్త మున్నగువారు ఆరాధ్య సోమేశ్వరుఁడు సోమనాధుఁడు కాఁడనియు, అన్నమయ్య కృతి ననుసరించియే సోమనాధుఁడు తన గ్రంథములను రచించెననియు నభిప్రాయపడుచున్నారు. ఏదియెట్లున్నను అన్నమయ్య 18 వ శతాబ్ది నడుమ నున్నవాఁ డనుట నిశ్చయము.