పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విని "దేవా! నామనస్సు నిశ్చలమైనది. నేను నీనిశ్చితార్థమును వీడను" అని బదులు చెప్పెను. అవలోకితేశ్వర బోధిసత్త్వుడపుడు "అటులయినచో, నీవు ధాన్యకటకదేశముకరుగుము. ఆదేశపురాజధానికి దక్షిణమున నొక కొండలో సొరంగ మొకటికలదు. అందు వజ్రపాణియను పర్వతదేవుడు గలడు. ఆశక్తినుద్దేశించి వజ్రపాణిధారణి స్తోత్రమును జపింపుము. ఆతడే నీయభీష్టము నెరవేర్పగలవాడు" అని బోధించెను.

భావవివేకుడీ మహాంధ్రదేశమునకు వచ్చి వజ్రపాణి దేవునుద్దేశించి ధారణిని మూడు సంవత్సరము లేకచిత్తముతో జపించి వజ్రపాణిని ప్రత్యక్షము చేసికొనెను. వజ్రపాణి భావవివేకుని జూచి "శాస్త్రజ్ఞుడా! నీవేమి కోరి నాగూర్చి ఘోరమగు తపస్సు చేయుచున్నాడవు?" అని యడిగెను. అంతట నాతార్కికుడు "మైత్రేయ బోధిసత్త్వుడు వచ్చునందాక నేనీదేహముతో నుండవలెనని కోరుచున్నాను. అవలోకితేశ్వర బోధిసత్త్వునిచే ప్రేరితుడనె నిన్ను ప్రార్థింప వచ్చితిని. దేవా నీ వీయుపకారమును చేయనోపుదు వేని యనుగ్రహింపుము." అని ప్రార్థించెను.

"వజ్రపాణి దేవుడు సంతుష్టాంతరంగుడై భావవివేకుని కొక మంత్రము నుపదేశించి యిట్లనెను. ఈ పర్వతమునం దసురుల ప్రాసాదమున్నది. నీ వీమంత్రమును విధ్యుక్తముగా జరిపించినచో నాహర్మ్యముయొక్క శిలాద్వారములు వాని