పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యంతట నవె తెఱచికొనును. అంతట నీవు లోనికి బ్రవేశించి మైత్రేయుని యాగమమునకై నిరీక్షించుచుండుము. "భావవివేకుడపు డయ్యా నేనీ అంధకారమున నివసించుచుండ సుగతుని యాగమనమెట్లు తెలిసికొనగలను." అని ప్రశ్నించెను. అంతట వజ్రపాణి, "నేను సుగతుని రాక నెరిగించి, లోకమునకు చాటుదును. నీ వంతట, వెలికి రావచ్చును." అని బల్కెను.

"ఇట్లు భావవివేకుడు, వజ్రపాణిచే బోధితుడై తదేకధ్యాన నిష్ఠతో నామంత్రమును మూడు వర్షములు జపించెను. మంత్రోచ్ఛారణచే పవిత్రీకృతములయిన ఆవగింజలను కొండపై జల్లెను. వెంటనే, యానగము నందు బ్రహ్మాండమయిన సొరంగమొకటి గాన్పించెను. ఆసొరంగము జూచుటకై అనేకమంది జనులు వచ్చిరి. కాని వా రెవ్వరును నాసొరంగమును విడచి పోజాల నట్లు ఆతనికిపొడగట్టెను. వారి స్థితిని జూచి భావవివేకుడు, స్థిరచిత్తుడై, యాగుహసింహద్వారముయొక్క గడపనుదాటి లోనికి బ్రవేశించి, తన్నవలోకించుచున్న జనసమూహమువైపు ముఖము ద్రిప్పి చిరకాలమునుండి మైత్రేయుని సందర్శనము కొరకై ధ్యానించితిని, పూజలు చేసితిని, ఇప్పటికి దేవతల కరుణా ప్రభావము వలన, నాశపధము నెర వేరినది. నేను మైత్రేయుని జూడబోవు చున్నాను. బుద్ధునియొక్క యుపదేశమును బొంద గోరువారు, నాతోగూడ నీ గుహాంతరాళమును బ్రవేశించుడు, రండు." యని బిగ్గరగా నాహ్వానించి పల్కెను.