పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయసింహమహరాజును, రాజ్యాభివృద్ధికై, వరుసగా కృష్ణకు దక్షిణమునగల దేశమును జయింపనారంభించెను. ఇట్లు సుమారొక యర్థశతాబ్దమువఱకు నెడతెగని పోరాటములలో మునిగియున్న దేశమున జనసంఖ్య స్వల్పముగా నుండక బహుళముగా నెట్లుండును? ఇన్ని కారణములకుతోడు చాళుక్యరాజులకు ప్రక్కలో బల్లెములక్రింద, పశ్చిమమున రాష్ట్ర కూటులును, దక్షిణమున పల్లవులును తలయెత్తి మెదలుచు నూపిరి సలుపకుండ నొత్తిడి కలుగజేయుచుండ, జనసంఖ్య నభివృద్ధిలో లేకుండుటయం దాశ్చర్య మేమిగలదు?

యు ఆన్ చ్వాంగ్, వేంగీదేశమునకు వేంగీనగరము రాజధానియని దెలుపుచున్నాడు. కుబ్జవిష్ణువర్థనుడు పిష్ఠపురమును రాజధానిగా జేసుకొని యుండగా నాతని కుమారుడు, నగరును వేంగీపురమున కేల మార్చెనో ఎఱుకపడకున్నది. అయినను కారణ మిట్లూహింపవచ్చును. అప్పటివఱకు దేశమును బాలించిన విష్ణుకుండినవంశమున నంకురము లేకుండ నూడబెఱికి వేయుటకును, కృష్ణానదికి దక్షిణమున నున్న ప్రాంతమును వశపఱచు కొనుటకును ఈశాన్యదిశనుండి, కళింగ గాంగరాజుల వలన కలుగు యొత్తిడికి దూరముగ నుండుటకును అనుకూలమైనదని వేంగీపురమునకు రాజధాని మార్చి యుండును.

యు ఆన్ చ్వాంగ్, కళింగనగరమునుండి బయిలుదేరినది మొదలుగా దాను జూచినవాటిని విన్నవాటిని సవి