పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్తరముగా వర్ణింపని కతమున, నాకాలమున బ్రసిద్ధము లయిన జైనబ్రాహ్మణ క్షేత్రములు, నగరములు, మత, రాజకీయ పరిస్థితులు వివరముగా దెలియకున్నవి. ఎందుచేతనో కాని, శ్రీకాకుళమున కనతిదూరమున నున్న సాలెహుండాము సంఘారామముగాని, అనకాపల్లికి సమీపముననున్న సంఘారామముగాని, రామతీర్థాలుగాని,పిష్ఠపురముగాని తక్కుంగల బ్రాహ్మణ, జైనక్షేత్రములుగాని యాతని వ్రాతలందు గానబడకున్నవి. వీని కంతకు నొకటిరెండు కారణములు పొడసూపు చున్నవి. దేశము జనశూన్యమై యుండుటచేత నెక్కడ నేది గలదో చూపించు వారు లేకపోవుచుండుట మొదటిది గావచ్చును. మనయాత్రికునికి బౌద్ధమతము గాక అన్యమతములందు గల అసహనము రెండవది గావచ్చును. ఉత్తర హిందూస్థానమున నప్పటి కింకను బౌద్ధమతము మంచి యాదరణ బొందుచు, నుచ్చదశయం దుండెను. అచ్చట నాత డెక్కడెక్కడకు బోయినను, రాజులు, మహారాజులు, బౌద్ధధర్మావలంబకులయి, బిక్షువులను రావించుచు 'ధర్మ' వ్తాప్తికి సదుపాయములను గల్పించుచు, సంఘారామములను మంచిస్థితియం దుంచుచు బోషించుచుండుట జూచుచుండెను. ఇక దక్షిణాపథమం దట్లు గాకుండెను. రాజు లెక్కడకు బోయినను బ్రాహ్మణమతావలంబకులుగా నుండిరి. శైవ, వైష్ణవ, జైనమతములను జనులు విశేషముగా నాదరించుచుండిరి. వారికి బౌద్ధముపై నాదరము సన్నగిల్లుచుండెను.