పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౬

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

యుండినను నిరువురు నొక్క కాలమున మరణించిరి. సాద్వహుని చావును, నాగార్జునుని చావును, ఇట్లు తటస్థించెనని చెప్పుదురు.

సాద్వహునకు, కడగొట్టు వాడొకడు చిన్నకుమారుడుండెను. అతడు తా నెప్పుడు సింహాసన మధిష్ఠించి రాజ్యమును బాలింతునా యని సర్వాదా చింతా నిమగ్నుడై యుండెను. ఆత డొకసారి తల్లిని జేరబోయి "అమ్మా! నేనెపుడు సింహాసనమెక్కి రాజ్యము చేయుదును?" అని యడిగెను. అందుల కారాణి విచారముతో! "కుమారా! ఈ జన్మమున నీవు సింహాసనమున గూర్చుండి రాజ్యాభిషిక్తు డవయ్యెదవని నాకు తోచదు. నీ జనకుడిప్పటికి కొన్నివందల సంవత్సరములు జీవించియున్నాడు. అతనిముంగిట నెందరో పుత్రులు, పౌత్రులు, పెద్ద కాలము జీవించి, మరణించిరి. ఇది యంతయు నాగార్జునుని శక్తి ప్రభావము. ఏక్షణమున నాబోధిసత్త్వుడు మడియునో. యా యుత్తర క్షణమున నీతండ్రియు దేహయాత్ర జాలింపగలడు. ఈనాగార్జునుని ప్రజ్ఞాబుద్ధులును, జ్ఞానమును అపారములు. అతని ప్రేమయు దయయు నగాధములు. ప్రపంచమందలి జీవులకై యాతడు, తన దేహమును, ప్రాణమును సమర్పింప వ్రతము బూనియున్నాడు. కావున నీవరిగి యాతని సందర్శింపుము. అతడు నీకేమి కావలయునని యడిగిన నీశరీరమిమ్మని కోరుము. నీవిది యొనర్చిన నీయభీష్టము సిద్ధించును." అని