పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతి వైభవముగ జరుపుదురు. ఆమహోత్సవములు కన్నుల పండువుగా జూడవలసినదేకాని వర్ణింపనలవిగానిది. అయినను ఆమహర్నవమి వృత్తాంతమును వర్ణింప బ్రయత్నించెదను. ముందుగా సామ్రాజ్యములోని యన్నిప్రాంతముల నుండియు, మండలేశ్వరులను, మహామండలేశ్వరులను, దుర్గాధిపతులను, దళవాయిలును, మహర్నవమి పండుగలకు రాజధానికి రావలసినదని యాజ్ఞాపించును. కొందఱి మండలేశ్వరుల రాజ్యములు రాజధానికి మూడుమాసములు ప్రయాణదూరమునందు గూడ నున్నవి, ఆవచ్చిన సామంత రాజులందఱకును తమ పరివారములో వేయేసియేనుగులకు తక్కువగా కుండ నుండును. తుపానుచే నల్లకల్లోలమైన, యలలచే నొప్పారు మహాసముద్రపు కెరటములవలె నీమత్త గజముల తొండములు విసరు కొనుచు, ఊగుచు లేచుచు ఊపుకొనుచు నడచుచుండును. ఆమత్తేభముల ఘీంకారములు మేఘగర్జనములని భ్రమింప జేయుచుండును. తొండములకు ముఖములకు తళతళమెరయు ఇనుపకత్తులు, బాకులు, బల్లెములు, తాపించిన కవచములును సర్వాలంకారభూషణములతో, వింతవింతరంగులతో, శృంగారింపబడిన చవుడోలులమర్పబడి, నామదకరు లొండొంటి నొరసికొనుచు, తొండములు సాచుచు, విసరుచు మావటీండ్రను బెదరించుచు, చూపరులు విసరుఫలముల నందుకొనుచు నడచుచుండును. ఈయేనుగులపై నొక్కొక్కప్పుడామండలేశ్వరుల పరివారమునకుజెందిన గార