పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయనగర యాత్ర.

"ఈనీచుడు" సామూరివద్ద సెలవుతీసికొని, కళ్లికోట నుండి బయలుదేరి, బందాన రేవుమీదుగా, మలబారు సముద్రతీరమున ప్రయాణము చేయుచు విజయనగర రాజ్యము పొలిమేరల నున్న 'మంగళూరు' రేవును చేరెను. అచ్చట రెండు మూడు దినములుండి మెట్టదారిని విజయనగరమునకై బయలుదేరితిని. మంగళూరు దాటి ముప్పదిమైళ్లు వచ్చునప్పటికి ప్రపంచమునం దెచ్చటను సాటిలేని యొక చక్కని దేవాలయమును జూచితిని. ఆ దేవాలయము పదిగజముల చతురమును అయిదుగజముల ఎత్తును గలిగియున్నది. అదియంతయు కంచులోహముతో చేయబడి యున్నది. ఆ దేవాలయమునకు నాలుగు అంతస్తులుగలవు. అవి యొకదానికంటె నొకటి యెత్తుగ నుండును. అన్నిటికంటె ఎత్తైన అంతస్తులో మనిషి ఎత్తుగల దేవునిసువర్ణవిగ్రహము గలదు. ఆ విగ్రహమునకు రెండు ఎర్రని పెద్ద కెంపులు నేత్రములుగా నమర్పబడి యున్నవి. అవి చూచువారికి, విగ్రహము తనవైపు చూచు చున్నదేమో యనునంత మనోహరముగా నమర్పబడి యున్నవి. ఆ దేవాలయ మంతయును మనోహరమయిన శిల్పపుబనులతో శోభిల్లుచు కనులకు మిరుమిట్లు గొల్పుచుండును.

"అచ్చటి నుండి పోవుచు, ప్రతిదినమును నొక్కొక్క జన సమ్మర్దమయిన పట్టణమునందో గ్రామము చెంతనో ఆగుచు పయనము చేయు చుంటిని. ఇట్లుండ నొకనాడు నేను ఆ