పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాబు వ్రాసియుండెననియు దెలియవచ్చెను. సామూరి విజయనగర చక్రవర్తికి సామంతుడు గాకపోయినను, అతడనిన, సామూరి కత్యంత భయముగలదు. ఆచక్రవర్తికి కళ్లికోట వంటి రేవులు మూడువందలు గలవట! మరియు నాతని దేశము మూడుమాసంబులు ప్రయాణము చేసినను తరగనిదట!

"కళ్లికోట మొదలు కాయిల్ వఱకుగల రేవుపట్టణము లనేకము లింకను మలబారు దేశమునందు గలవు. కాయిల్ పట్టణము సింహళద్వీపమున కెదురుగా నుండును. కళ్లికోట నుండి బయలు దేరు ఓడలన్నియు మక్కాకు సాధారణముగా మిరియములు, ఏలకులు, లవంగములు, జాజికాయ మున్నగు సుగంధ ద్రవ్యములను దీసికొని పోవుచుండును. కళ్లికోటలో నుండు నావికులు మంచి సాహసికులు. వారిని చీనిపుత్రులు అని పిలచెదరు. ఒకానొకప్పుడు చీనా దేశీయులు నావికులు కొందఱీకళ్లికోటకు వలసవచ్చి యుండిరట. అందువలన వారి సాహసిక నౌకాయానమును బట్టి యీ కాలపు నావికులకు చీని పుత్రులనుపేరు కలిగినదేమో! కళ్లికోటకు వచ్చెడి యోడలను, రేవులోని యోడలను ఓడదొంగలు దరిజేరరారు. ఆ రేవున యీయా వస్తువులను భేదము లేక సమస్తమును దొరకును. ఆవుమాంసము మాత్రము లభింపదు. ఇక్కడవారు ఆవులను చంపరు. వాటిమాంసమును భుజింపరు. గోవనిన వారల కెంతయో భక్తి. దాని పేడతో చేసినబూడిదను యీ మూర్ఖులు నుదుటిపై ధరింతురు - దౌర్భాగ్యులు!!!