పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను దమకుదోడుగా నంపవలసినదని, రాయబారులు ఖానుని ప్రార్థించిరి. అంతరంగమున, నిష్టములేక పోయినను, మాట తీసివేయజాలక, చక్రవర్తివారి ప్రార్థన మంగీకరించెను. ప్రయాణమునకు గావలసిన దానికంటె యెన్నియో రెట్లధికముగ వారి కన్నియు నిచ్చి యంపెను.

చీనా దేశమునుండి, మన యాత్రికులు 1293 వ సంవత్సరమున బయలుదేరిరి. వారికి పారశీక దేశమును జేరునప్పటికి రెండు సంవత్సరములు పట్టెను. ప్రయాణములో, పరివారము లోనివారు ఆరు వందలమంది మరణించిరి. ఇట్లుండ, పెండ్లివారు పారశీక దేశమును ప్రవేశించు నప్పటికి, సుల్తాను, కాలధర్మము నొందినట్లు దెలిసెను. కాని యింతవ్రయప్రయాసల కోర్చి, తీసుకొని రాబడిన వధువునకు ప్రియుడు దొరకకపోలేదు. సుల్తాను గతించినందున సింహాసనమెక్కిన యాతని సుతు డాసుందరిని పెండ్లియాడెను. క్రొత్తసుల్తాను, మనయాత్రికులకు కుబ్లయిఖానువలెనే విశేషముగ నాతిధ్యసత్కారములు నెఱపి, స్వదేశమును సుఖముగా జేరుటకు వలయు సదుపాయముల ననేకముల గల్పించెను. వారికి, అశ్వదళమును కొంత అంగరక్షగా నిచ్చి సాగనంపెను. స్వదేశోన్ముఖులై, పయనమయి, చాలదూరము సాగకపూర్వమే వారలకు, తమయేలికయు, పోషకుడునగు కుబ్లయిఖాను చక్రవర్తి పరలోకగతుడయ్యె నన్న వార్త దెలియవచ్చెను. ఆవార్తవిని వారు మిక్కిలి సంతాపమును బొందిరి. పారశీకమునుండి వెనీషియా నగరమును