పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు ప్రార్థించుటయు, నందులకాతడు, వారిమీదగల ప్రేమాతిశయము చేతను, వారివంటి విశ్వాసపాత్రులయిన మిత్రులును, సచివులు, భృత్యులు నికలభింపరను సందేహము చొప్పునను వారిప్రార్థన నంగీకరింపడయ్యెను. ఇపుడును చక్రవర్తి యంగీకరించియుండడు గాని, దైవయోగమున నొకయవకాశము గల్గెను. పారశీక ప్రభువున కప్పుడు భార్యా వియోగము కలిగెను. మరణశయ్యమీద నున్న నాతని సతి, తనపుట్టింట బుట్టిన యాడపడుచును గాని యితరుల వివాహమాడ వలదని, భర్తను శాసించెను. అనురాగ బద్ధుడైన సుల్తాను ఆమె కడసారి ముద్దు చెల్లింప సంకల్పించుకొనెను. అతడు వరింపవలసిన బాలిక చీనాచక్రవర్తియగు కుబ్లయిఖానుని వశమందుండెను. ఆమెతలితండ్రు లాతనిసామంతులు. అందువలన పారశీకసుల్తానా బాలిక కొఱకు కుబ్లయిఖానునకు సందేశహరులనంపెను. ఆయువతికప్పటికి పదునేడు సంవత్సరముల వయసుండెను. లేతయవ్వనమున నున్న యాసౌందర్యవతి నిచ్చి, రాయబారులను ఖాను ప్రయాణ సన్నాహము గావించెను. కాని అంతలో, తార్తారులలో తార్తారులకు అంత:కలహములు సంభవించి భయంకరరూపమును దాల్చెను. ఎంతపరివార మిచ్చినను ఆరాయబారులను బాలికను, నాటుదారిని, యుద్ధభూముల గుండ పారశీక దేశమున కంపుటకు ఖానుడంగీకరింపక, పెద్దనౌకాదళమును సమకూర్చి, సముద్రమార్గమున ప్రయాణము సన్నాహపఱచెను. సముద్రయానము, పారశీకులకు నూతనమగుటచేత, తెలిసిన వెనీషియను