పుట:Aananda-Mathamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

మహేంద్రసింహుని ప్రవాసము.

సుమారు వేయియు నేడువందలడెబ్బదిమూఁడవ (1773) సంవత్సరము గ్రీష్మకాలమున పదచిహ్న మను గ్రామమునం దొక్కనాఁడు ఎండవేఁడిమి మహాబలముగా నుండెను గ్రామమో పెద్దది. వేలకొలఁది యిండ్లున్నవి. అయినను గ్రామమునం దొకఁడైనను కవఁబడలేదు. చాలు చాలుగా అంగళ్ల వీథులు, పెద్దమార్కెట్, ఒక్కొకవీథిలోను వేలకొలఁదిపూరి యిండ్లు, వానిలో పెద్దవిగను చిన్నవిగనుండు మేడలును కలవు. ఆదిన మెచ్చటను నిశ్శబ్దమే. అంగళ్లు మూసియుండెను. ఆ దినము సంతచేరువారము సంతలోను ఎవరును లేరు. భిక్షమునకు వచ్చువారును ఆదినము రా లేదు. నేఁతగాండ్రు, ముగ్గములను కట్టివేసి యెచ్చటికో పోయి యేడ్చుచుండిరి. రైతులు గొడ్డుగోదలను విడిచిపెట్టి బిడ్డలతోఁగూడి యెక్కడికో పోయిరి. పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులు పరుగిడిపోయిరి. బిడ్డలకుఁగూడ గట్టిగా నేడ్చుటకు దైర్యము లేదని తోఁచెను. రస్తాలలో నొక్కడైనఁ గనఁబడఁడయ్యె. గుంటలును చెఱువులును విజనమై యుండెను. ఇంటిముంగిళ్లలోను మనుష్యులు లేరు. చెట్లలోఁగూడ పక్షులు లేవు. కొట్టములలో నొక పసరమైన లేదు. కేవలము శ్మశానమువలె కుక్కలు నక్కలు తిరుగుచుండినవి.