పుట:Aananda-Mathamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఆనందమఠము

పశుపక్షులు నిశ్శబ్దముగా నుండెను. కోటానుకోట్లపశుపక్షికీటకాదు లావనమునందు వాసము చేయుచుండెను. అయినను, ఒకదాని శబ్దముకూడ వినఁబడలేదు. శబ్దమయప్రపంచమునం దున్నవారికి, ఆ నిశ్శబ్దభావము ననుభవించుట మహాకష్టము.

తుద మొదలు లేని యా వనమధ్యమందు, ఆసూచ్యభేదమైనట్టి యంధకారమయమైన యర్ధరాత్రియందు, అనను భవనీయమైన నిశ్శబ్దమధ్యమున “నామనోరథము సిద్ధికాదా, ఏమి?” అనెడి శబ్దము వినఁబడెను.

ఈశబ్దమును విన్నతోడనే ఆయరణ్యము మరల నిశ్శబ్దమున మునిఁగిపోయెను. ఇట్టి భయంకరమైన మహారణ్యంబునందు మనుష్యధ్వని వినఁబడు నని యెవ్వరు చెప్పుదురు? కొంచెముసేపటికి అనిస్తబ్దముకు మథించికొని మనుష్యకంఠస్వరముతో “నామనోరథము సిద్ధికాదా, ఏమి? " అను ధ్వనియే మరల వినఁబడెను.

ఇట్లు ముమ్మాఱు ఆయంధకారసముద్రమునందు ధ్వని వినఁబడెను, ఆప్రశ్నకు ఉత్తరముగా “దీనికై నీవు సమర్పించు కానుక యేది ?” అనెడి శబ్దము వినఁబడెను.

దానికి ప్రత్యుత్తరము - 'నాప్రాణమే దీనికి కానుక.'

మరల ప్రతిశబ్దము - 'ప్రాణము కేవలము తుచ్ఛమైనది, అందఱును దానిని ద్యజింపఁగలరు',

“వేఱేమి కావలయును? దేనిని సమర్పింపవలయును?'

దీనికి ఉత్తరము - 'భక్తి.'


__________