పుట:2030020025431 - chitra leikhanamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎల్లసమయములయందు నిది యిట్టిస్థితియం దుండదు. కొన్నిసమయములయందు చల్లారి నల్లనిపొగమాత్రము వచ్చుచుండును. మఱికొన్నిసమయములయం దీపొగకూడ రాదు. అట్టిసమయమునందు మనము వెళ్లి దాని కన్నము ద్వారా చూచినయెడల, అన్నివస్తువులు కరిగి అగ్నిప్రవాహమువలె ప్రవహించుచున్నటుల చూడగలము. దీనిని చిత్రించునపు డెఱుపును నలుపును విస్తార ముపయోగపడును.

వేడినీటియూటలు చూచుట కగ్నిపర్వతమువలె కానవచ్చును. కాని యిందు రాళ్లు, పొగ మొదలగునవి పైకి రావు. వేడినీళ్లుమాత్రము పైకి లేచుచుండును.

వర్షము :- వర్షమునందు దగ్గర నున్నవస్తువులు కొంచెము కానబడుచుండును. దూరముగ నున్నవి కాన బడవు. గాలివీచును చెట్లు వంగియుండును. దేశమంతయు నీటిమయమైయుండును. జంతువు లన్నియు తడిసిపోవును. మనుజులు గొడుగులు వేసికొని పడిపోవుదు రేమో యనుభయముతోను, బట్టలు తడిసిపోవు నేమో యను భీతితోను అతిభయముగ నడచుచుండురు. ఆకాశమంతయు భయంకర మై మేఘావృత మై యుండును. చీకటి క్రమ్మియుండును. ఇట్టిచిత్రమును వ్రాయు టతికష్టము.బాగుగ నభ్యాసమైననేగాని యిట్టివాటిని చిత్రించుటకు పూనుకొనరాదు.

ఇంద్రధనుస్సు యిట్టిసమయములయందు కాననగును. ఇందు రంగు లెటువలె నుండునో యిదివరకే చెప్పి యుంటిని. దానిప్రకారము నిపుణతతో చిత్రించవలెను. ఇం దేమియు చెప్పుటకు వీలులేదు. చెప్పిన లాభము లేదు. అందువలన విద్యార్థులు ఆకాశమునం దీయొంద్రధనస్సును చూచి వ్రాయుట యుత్తమము.

సూర్యుడు :- భానుడు లోకబాంధవుడు. ఈతడు లేనియెడల లోకమంతయు నంధకారబంధుర మైయుండును. జీవరాసు లన్నియు చనిపోవును.

సూర్యునివెలుతురు, ప్రకృతిని చాలవఱకు మార్చి వేయు ననియు, సూర్యుడు ప్రకాశించునప్పుడు ప్రదేశ చిత్రములను వ్రాయుట కష్ట మనియు నిదివరకే చెప్పితిని.

ప్రస్తుతము సూర్యుని చిత్రించుటను నేర్చుకొందము. 35 - 4 లో చూపిన విధముగ చిత్రింపవలెను.

సూర్యబింబమునకు విస్తారము తెలుపు.

ఇంద్రధనుస్సువలెనే దీనిని జాగరూకతతో చిత్రింపవలసియుండును.

దూరముగనుండుసముద్రముయొక్క రంగును, సూర్యునియొక్క రంగును ఒకేవిధముగ నుండును. ఇరువైపులు నుండుజలభాగమునకు నలుపును, ఇండిగోరంగును, కొబాల్టును, బరంటుశయనారంగును వేయవలెను.ఆకుపచ్చమాత్రము విస్తారము వేయకూడదు.

సూర్యోదయమును, సూర్యాస్తమయమును, 35 - 5 లో చూసిన విధముగ చిత్రింపవలెను.

దీని కుపయోగించురంగులు:-

(1) కొంచెము ఆకుపచ్చ, నీలి.

(2) కోబాల్టును, కొంచెము క్రిమిజనులేకును, బరంటుశయనారంగు.

(3) విస్తారముకోబాల్టు, కొంచెము ఇతరరంగులు.

(4) ఇంక విస్తారము కోబాల్టు, చాలకొంచెము ఇతరరంగులు.

(5) గ్రేవర్ణము, కోబాల్టు, క్రిమిజనులేకు, బరంటుశయనారంగు.

(6) క్రిమిజనులేకు, వెర్మిలియనువర్ణము.