పుట:2030020025431 - chitra leikhanamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిర్రసుమేఘములు అన్నిమేఘములకంటె మంద మైనవి. ఇవి చాలయెత్తుగాను, సన్నముగాను, పొడవుగను, తెల్లగను నీలితో----మునం దివి కానవచ్చును. ఏకముగ నుండక విడివిడిగా సమాంతరములుగ నుండును. కొన్ని సమయములయందు ఇవి సమకోణములుగ కలిసికొనును. ఆకాశపుభావిస్థితి నెమ్మదిగ నుండునపుడు ఇట్టిమేఘములు కానవచ్చును. ఇవి కానబడునప్పుడు మంద మైనగాలి వీచి హృదయమును రంజింప జేయుచుండును.

క్యూములసుమేఘములు సిర్రసుమేఘములకంటె కొంచెము దట్టముగ నుండును. గాలితో నివి కదలుచుండును. వర్ష చిహ్నములు కానవచ్చునప్పు డివి విడిపోయి ముద్దలుముద్దలుగ నున్నటుల కానవచ్చును.

స్ట్రేటసుమేఘములు భూమికి చాల దగ్గరగ నుండును. ఇవి యేకముగ కనబడును. గుండ్రముగాను, పొరలు పొరలుగాను ఇవి యున్నటుల కానవచ్చును. ఈమేఘములు కానవచ్చునపుడు పెద్దగాలి సాధారణముగ వచ్చును.

క్యూములోస్ట్రేటసుమేఘములు మిక్కిలి భయంకరములుగ కానవచ్చును. ఇట్టిమేఘములను చూచినప్పు డెవరి మనములు వేదాంతసంబంధ మైనయూహలతో నిండకుండును? వీటిఅంచులు తెల్లగ నుండును. అందువలన మంచుతో కప్పబడినపర్వతసమూహములవలె కనబడి హిమాలయపర్వతములను జ్ఞప్తికి దెచ్చును.

నింబసు మేఘములను వర్ష మేఘము లని పిలుచుటయం దేమియు నతిశయోక్తి లేదు. ఇవి వేగముగ నాకాశము నావరించి ప్రపంచము నంతను కాంతిహీనముగ చేసివేయును. అంతకంత కివి యభివృద్ధి నొందును. వెంటనే మెరపులతోను, ఉరుములతోను, భయంకరముగ వర్షించును. వర్షాంతమునం దివి వెంటనే మాయ మైపోవును. ఇట్టివాటిని మీ రనేకపర్యాయములు చూచియే యుందురు. పైజెప్పినమేఘము లెప్పు డైన మీకు కనబడినయెడల వెంటనే వాటిచిత్రములను వ్రాసి పదిలపఱిచియుండవలెను. ఎప్పటికైన నీచిత్తరువులు పనికివచ్చును.

గాలులు :- గాలులు మనకు కానరావు. ఇవి మనకు చాల ఆవశ్యక మైనవి. ఇవి వీచి, యిండ్లు చెట్లు మొదలుగాగలనిర్మాణముల నన్నిటిని పాడుచేయుచుండును. గాలిని చిత్రమునందు చూపలేము కాని అది చేసినట్టియు చేయుచుండినట్టియు పనిని చూపగలము. చెట్లు విరిగిపోయినట్టును, విరుగుచున్నటులను, విరిగిపోబోవుచున్నటులను, ఆకులుమొదలగునవి యెగురుచున్నటులను, బట్టలు గాలియందు కొట్టుకొనుచున్నటులను, వ్రాసినయెడల గాలి వీచుచున్నటుల వెంటనే విదిత మగును కాని గాలి యొకేవైపునకు వీచుచుండును. అందువలన సృష్టియం దుండు వస్తువు లన్నియు నొకేవైపునకు వాలియుండును. సుడిగాలులు బహువిచిత్రముగ నుండును. ఆకులు, యిసుక, యింక దానియావరణమునకు వచ్చినవస్తువులు మీది కెగిరిపోవును. ఎడారులయందు సుడిగాలి వీచుసమయమునయిసుక స్తంభములు లేచుచుండును. ఇరువైపులనుండి రెండు సమానబలము గలగాలులు వీచునప్పు డిట్టివి సంభవించును.

సైమూనుగాలులు అరేబియాయందు విస్తారము ప్రబలును. ప్రారంభమున నాకాశము నిర్మలముగ నుండును. సూర్యుడు తీక్ష్ణముగ ప్రకాశించును. ఈసైమూనుగాలి వీచుచు దానితో యిసుకను తీసుకొని పోవుచుండును. ఇవి చాలవరకు విషవాయువులు. వీటిబారినుండి తప్పించుకొనుటకు మనుష్యులు భూమిమీదను పండుకొనెదరు. ఒంటెలు వాటిమూతులను ఇసుకలో దూర్చివేయును. చలికాలమునం దీగాలులు చల్లగనుండును. ఇట్టిగాలులను ప్రదర్శింపవలె నన్న,ఇసుక యెగురుచున్నటుల, మనుజులు, ఒంటెలు, యిసుకమీద చచ్చి పడియున్నటుల వ్రాయవలెను.

అగ్నిపర్వతములు:- ఇవి నిజముగ పర్వతములు కావు. అగ్నిచే చేయబడలేదు. భూమియొక్క అంతర్భాగమున కొన్నిమార్పులు కలిగి అనేకవస్తువులు ద్రవరూపముగ మాఱి భూమిని పగుల్చుకొని, పైకివచ్చి యెత్తుగ లేచును. ఆపదార్థములే నలువైపుల పడును. అందువలన చుట్టును భూమి యొకపర్వతాకారమును దాల్చును. ఈఅగ్నిపర్వతములు విజృంభించునపుడు దగ్గర కెవరును వెళ్లజాలరు. 35 - 3 చూడుము.