పుట:2030020025431 - chitra leikhanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇండియా ఎఱుపు ముఖమునందు ఛాయవేయుటకు పనికివచ్చును. నీలితో కిలిపికూడ దీనిని యుపయోగించవచ్చును.

చిందూర రంగును గులాబివర్ణముతో కలిపినయెడల సౌందర్య మైనచర్మపురంగుగ నుపయోగపడును.

కోబాల్టునీలి ననేకచోట్ల నుపయోగించెదరు. తెల్లని వస్తువులయందు ఛాయను చూపుటకు విస్తార ముపయోగించెదరు. ఇండియా ఎఱుపుతో కలిపినయెడల ముఖమునందు నీడను వేయుట కుపయోగపడును.

పరాసు నీలము బట్టలకు వేయుదురు. గాజునీలి కోబాల్టునీలినుండి చేయబడును. ఇది యూదామిశ్రితమైన నీలివలె కానవచ్చును.

ఇండిగోరంగు ఆకుపచ్చమిశ్రిత మైననీలివలె కానవచ్చును. ఇది వెనుకభాగమునందు (back ground) వేయుటకు పనికివచ్చును. సిపియా (Sepia) తో కలిపినయెడల దూరమున నున్నచెట్లకు వేయవచ్చును. ఇంక ననేక విషయములయం దివి పనికివచ్చును.

నీలిరంగును ఆకాశమునకును వస్త్రములకును వేయవచ్చును. క్రిమిజనువర్ణముతో దీనిని కలిపినయెడల చక్కని యూదారంగు వచ్చును.

మనకు యిప్పుడు కావలసిన రంగులవిషయమై యిచ్చట చెప్పితిని. ఇదివఱకు మీరు చేసినయభ్యాసమునందు తక్కినవాటితో మీకుపరిచయము కలిగియే యుండవచ్చును. అందువలన నే నిచ్చట చెప్పవలసిన యవసరము లేదు.

కుంచెలు:- చర్మపురంగును వేయుటకు కుంచెలు సాధారణపు పరిణామమును గలిగియుండవలెను. ఇవి సేబిలు రోమముతో చేయబడియుండవలెను. వాటికొనలు సూదిగనుండిననే చిత్రించుట కనుకూలముగ నుండును. చేతితో కొనను నొక్కి విడిచినయెడల దానిపూర్వపు ఆకారమును దాల్చుచుచుండుట మంచిది. కొన్నిసమయములయందు కొనలేనికుంచెలు పనికివచ్చును. ఇట్టిపనులయందు వాడుటకు సాధారణముగ ప్రాతకుంచెల నుపయోగించెదరు. చిత్రములను కుంచెలతో చిత్రించునపుడు ప్రక్క నొక్కదన్నుపై చేతిముడుకు నుంచవలెను. ఇటుల చేసినయెడల నొప్పి యుండదు. చేయి వణకదు. చిత్రలేఖకుడు తాను చేయుచున్నపని నంతను స్పష్టముగ చూడగలుగును.

తరగతులు:- సాధారణముగ ముఖమును చిత్రించుట మూడుతరగతులుగ భాగింపబడినది. చిత్రమును పెన్సిలుతో వ్రాసి మొదటిపర్యాయము రంగును వేయుట మొదటితరగతి. రెండవతరగతియందు ముఖమునకు గుండ్రము నిచ్చుఛాయను, బుగ్గలకు రంగును, వెండ్రుకలకును, బట్టలకును, ప్రధానరంగును, ఛాయను వేయవచ్చును. రెండుమూడుతరగతులకు మధ్య చర్మపురంగును కొంచెము మృదువు చేయవచ్చును. చిత్రలేఖకున కభ్యాసము బాగుగ కలుగువఱకు మనుజుని ఎదుట నుంచుకొనకయే రంగును వేయకూడదు. బట్టకు రంగును ఎప్పుడయినను వయవచ్చును. మూడవతరగతియందు చిత్రమును మృదువుచేసి, తప్పులను దిద్దుకొని పూర్తిచేయవలయును.

ఎవరిచిత్రమును నీవు వ్రాయుచున్నావో ఆవ్యక్తి నీవు చిత్రించునంతకాలము నీదగ్గర కూర్చుండియుండవలెను. ఛాయాపటములను పెద్దవిచేయుటయందు వ్యక్తి నీదగ్గరనుండ నక్కరలేదు. వానిప్రతిరూప ముండిన చాలును.

తరగతి యనగా వ్యక్తిని దగ్గర నుంచి చూచుచు వ్రాయుట యని నాయర్థము. అందువలన పైజెప్పిన ప్రకారము వ్యక్తిని ముమ్మాఱు దగ్గరనుంచుకొని పటమును చిత్రించి పూర్తిచేయవచ్చును. వస్త్రములను, వెనుకభాగమును తదితరసమయములయందు చిత్రించవచ్చును.

రూపముయొక్క ఉనికి. (Position)

ఎవనిచిత్రమునైతే మనము వ్రాయుదుమో వానిముఖమును అనేకవైపులనుండి చూడవలెను. ఏవైపుననుండి ఆముఖము సౌందర్యముగ కనబడునో అచ్చోటనుండి చూచుచు మనము ప్రతిరూపమును వ్రాయవలెను. ఎవని