పుట:2030020025431 - chitra leikhanamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్మమునకు వేయురంగులు.

(1) తెలుపు. (Chinese White)

(2) ఇండియా పసుపు. (Indian Yellow)

(3) తేలికయైన ఎఱుపురంగు. (Light Red)

(4) చిందూర రంగు (Vermillion)

(5) ఇండియా ఎఱుపు (Indian Red)

(6) బ్రౌను మేడరురంగు.(Brown Madder)

(7) కోబాల్టు నీలి. (Cobalt Blue)

(8) బరంటు శయనారంగు. (Burnt Sienna)

(9) వేండిక్కు బ్రౌనురంగు. (Vandyke Brown)

వెనుకటిభాగమునకును, బట్టకును వేయురంగులు.(ఇదివఱకు చెప్పినవి విడిచిపెట్టబడినవి.)

(!) గెంభోజి పసుపు (Gamboge)

(2) గోపిచందనము రంగు. (Yellow Ochre)

(3) సిపియా (Sepia)

(4) క్రిమిజను వర్ణము. (Crimson Lake)

(5) కారుమైను ఎఱుపు. (Carmine)

(6) పరాసు నీలవర్ణము. (French Ultramine)

(7) గాజునీలి. (Smalt)

(8) ఇండిగో వర్ణము. (Indigo Tint)

(9) నీలివర్ణము (Prussian Blue)

ఈరంగులగుణములను చెప్పనవసరములేదు.కాని యేయేరంగు లెందుకు పనికివచ్చునోకొంచెము చెప్పెదను.

తెలుపు:- అంత యుపయోగకారి కాదు. కంటిగుడ్లకును, ఆభరణములకును లేసు (Lace) ను చిత్రించుటకును పనికివచ్చును. కాంతియందు మెరయునప్పుడు వస్తువులు తెల్లగ కనబడును. అట్టిసమయములం దిది సహాయపడును. ఏమైనా తప్పుగా చిత్రించినయెడల నీరంగును పూసి యిదివఱకు వేసినరంగులను కనబడకుండ చేయవచ్చును.

ఇండియా పసుపురంగు:- బట్టలకు వేయుటకు బహుచక్కగ నుండును. దీనిని తెలుపుతో కలిపినయెడల చక్కని సువర్ణవర్ణము లభించును. కొన్నిసమయములయందు చర్మమునకు వేయుటకుకూడ పనికివచ్చును.

గోపిచందనము రంగు:- కొన్నిసమయములయందు జుత్తునకును వెనుకటిభాగమునకును వేయుట కుపయోగ పడును.

బరంటుశయనారంగు:- బట్టలకును, పచ్చనిప్రదేశచిత్రముల వెనుకటిభాగమునకును పనికివచ్చును. ఇండిగో వర్ణముతో కలిపినయెడల నిది యాకుపచ్చనివెనుకభాగముల కత్యంతోపకారిగ నుండును.

వేండిక్కుబ్రౌనురంగు:- చిత్రకారులకు చాల సహాయకారిగ నుండును. కాని యీరంగును వేసి దానిపై మఱియొకరంగును పూసినయెడల నీరంగు చెదరిపోవును. దీనిని క్రిమిషనువర్ణముతో కలిపినయెడల నీడగలస్థలముల యందు వేయవచ్చును.

సిపియా:- నలుపు మట్టిరంగంత గాడమైనదికాదు. దీనిని అభ్యాసముచేయుటకు మిక్కిలి యుపయోగించెదరు. నీలిమందురంగుతో దీనిని కలిపినయెడల దూరమున నున్నవృక్షములకు నీడయం దున్నవెనుకభాగములకును, తెల్లని వస్త్రములమడుపులయందు వేయుటకు పనికివచ్చును. క్రిమిజనువర్ణముతో కలిపిన బ్రౌనుమేడగు రంగువలె కానవచ్చును. ఇండిగోరంగుతోను, క్రిమిజనురంగుతోను కలిపిన చక్కని నలుపురంగు లభించును.

బ్రౌనుమేడరు:- రంగును నీలితో కలిపినయెడల నీడను చిత్రించుట కుపయోగపడును.

క్రిమిజను(రక్త)వర్ణము:- వస్త్రములను చిత్రించుటకుపయోగపడును. ఇది గట్టిగా కాగితమునకు పట్టియుండదు.

కారుమైను ఎఱుపు:- చర్మమునకు పనికివచ్చును. గులాబిరంగు బట్టలకు, చర్మములకు వేయుటకు మిగుల యుపయోగపడును.