పుట:2030020025431 - chitra leikhanamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముడుచుకొనును. కొన్ని పగటిపూట నట్టిమార్పును చెందును. వీటివిషయమై వీలైనయెడల మనము తరువాతను నేర్చుకొందము.

మొండెము :- భూమిపైని కొమ్మలెటుల వ్యాపించియుండునో భూమియందు వేరులటుండును. ఈవేరులే మొండెమును నిలువబెట్టియుంచునని యిదివఱకే నేర్చుకొనియుంటిరి. ఈమొండెము శాఖలను, ఆకులను భరించుచున్నది. ఇదికాక దీనిద్వారానే వేళ్లనుండి కొమ్మలకు ఆకులకు ఆధారము వెళ్లుచున్నది.

అన్నిచెట్లయొక్క మొండెములు ఒకేవిధముగ నుండవు. ఎవరో వ్రాసిన చిత్రములయందలి మొండెముల రూపములను మనము చూచి వ్రాయకూడదు. వీటిరూపములను సృష్టియందే చూచి వ్రాయ నభ్యసింపవలెను. మన మట్టిచెట్లను చూడనిది వ్రాసినయెడల అసందర్భములకు లోనగుదుము. మనస్నేహితు డొకడు న్యూయార్కును చూచి దానిని మనవద్దను వర్ణించుటను వినుటకును, మనమే స్వంతముగ నానగరమును చూచినదానికిని భేదములేదా? ఒకచిత్రమును చూచి వ్రాసినయెడల వివరములను వ్రాయజాలము. వ్రాసినయెడల సృష్టిననుసరించి యుండదు.

మామిడి, మఱ్ఱి మొండెములు సమముగ నుండవు. జామచెట్టుయొక్క మొరడు వంకరగాను నునుపుగాను ఉండును. గుగ్గిలపుచెట్టు సన్నముగన పొడవుగ నుండును. అరటిచెట్టు సన్నగను, పొరలుగ నుండును. ఇట్టివి మనము జాగరూకతతో నిత్యము గమనింపవలెను. ఒక్కొక్క జాతియొక్క వివిధవృక్షముల మొరడులు వివిధాకారములను దాల్చి యుండును కాని వానిజాతినైజములనుమాత్ర మతిక్రమింపవు.

ఇంకొకయంశమును గమనింపవలెను. ఎంతయెత్తుననుండి కొమ్మలు పుట్టునో చూడవలెను. కొబ్బరి, యీత, పోక, ఖర్జూరపుచెట్లమాట విడిచిపెట్టుడు. వాటికి కొమ్మలను పోలు ఆకులుతప్ప శాఖలుండనే యుండవు. కొన్నిచెట్ల కొమ్మలుబహుదిగువననుండి మొండెములను కప్పివేయును. దీనికి పనసచెట్టే నిదర్శనము. కొన్నిచెట్లయొక్క శాఖలు యెత్తుగ నుండును. మనుష్యులు సంచరించు స్థలములయందుండు చెట్లకొమ్మలు దిగువనే పుట్టును. ఏలయన: మనుజులు చిగుళ్లను కొట్టివేయుదురు. అందువలన ప్రక్కలయందు శాఖలు చిగుర్చును.

చెట్టుయొక్క మొండెమును చూచినవెంటనే అది యేజాతివృక్షమో సులభముగ పోల్చుకొనవచ్చును. చెట్ల యొక్క బెరడులు వివిధాకృతులను దాల్చియుండును. ఈవిషయమై యిదివఱకే చెప్పియుంటిని. గనుక నిక చెప్పవలసిన యగత్యము లేదు. జాగ్రత్తగ గమనించిననేగాని యిందు చెప్పినంతమాత్రమున నేర్చుకొనజాలరు.

చెట్టుయొక్క వివిధభాగములయందుండు బెరడుయొక్కలక్షణములను ఆకులురాల్పు కాలమునందు చూచుటకనుకూలముగ నుండును. అప్పుడు ఆకులేమియు మనకడ్డురావు. అందువలన చెట్టుయొక్క ప్రతిభాగమును స్పష్టముగ కన్పడును.

కొమ్మలు :- చెట్టుయొక్క మొండెమునుండి కొమ్మలు పైకివచ్చును. కాని ఒకేచెట్టుయందుండు కొమ్మలొక్క విధముగ నెప్పుడు నుండవు. బెర డొకేవిధముగ నుండును. కాని కొమ్మలయం దుండుబెరడుకంటె మొండెమునందుండు బెరడు గరకుగ నుండును. ఏలయన: కొమ్మలు లేతవి. బాలురదేహము కోమలముగా నుండును. వృద్ధులదేహమంత మృదువుగా నుండదు. అటులనే యీచెట్లయందుకూడ భేదము కాన్పించును.

కొన్నిచెట్లు చూచుటకు గుండ్రముగా నుండును. ఏలయన: క్రిందికొమ్మలు భూమివైపునకు వ్రాలియుండును. మీదికొమ్మలు సూటిగా లేచును. మధ్యనున్నకొమ్మలు క్రిందికొమ్మలకును, మీదికొమ్మలకును, మధ్యనుండు స్థలము నాక్రమించియుండును. అందువలన నిట్టి చెట్లకొమ్మలకోణములవిషయమై చెప్పుట కేమియు వీలులేదు. మీదికోణములు చిన్నవిగను క్రిందికోణములు పెద్దవిగ నుండునని చెప్పుటకుమాత్రము వీలు కలుగును.

కొన్నిచెట్లను దగ్గరగా పాతెదరు. అందువలన పెరుగుటయం దివి యనేకమార్పులను చెందును. ఈవిషయమందు మాత్రము మనము పైనిచెప్పిన ప్రకారము వర్తించుటకు వీలుండదు. ఎల్లపుడును సమయము ననుసరించియే మనము ప్రవర్తించుచుండవలెను.