పుట:2030020025431 - chitra leikhanamu.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ భాగము.

చెట్లు, వాటిని చిత్రించు విధము.

భారతభూమి సౌందర్యమునకు నిలయ మైయున్నది. దీనిప్రసిద్ధి పూర్వకాలమునందుకూడ లోకమునం దంతటను వ్యాపించియుండెను. ఈదేశమునం దన్నిదేశపు సృష్టిచిత్రములను చూడనగును. హిమాలయపర్వతపుచివరకు వెళ్లిన నుత్తరప్రదేశమువలె నుండును. మధ్యను సమతోష్ణముగ నుండును. కాబట్టి మన మనేకవిధము లైనదృష్టముల నెంచుకొని చిత్రించవచ్చును. ఇట్టిదృష్టములకు సొగసు కలుగజేయునవి వృక్షములే. వృక్షజాతులు మన దేశమునం దనేకము లున్నవి. చిత్ర లేఖనమునం దభ్యాసము కలుగజేసికొని మాతృభూమి యగుభారతదేశమున మంచి దృష్టముల నెంచుకొని చిత్రించి, జగత్తునం దంతటను ప్రసిద్ధిగాంచవచ్చును.

చిత్రకారులు చెట్లను వ్రాయవలెనన్న ప్రతివృక్షముయొక్క స్వభావమును గమనించవలెను. ఏలయన: అన్నిచెట్లు నొకేవిధముగ నుండవు. పుస్తకములను చదువుటవలనను, ఒక్క దినము ఈవిషయమున వినియోగించిన చెట్లను వ్రాయజాలరు. అందువలన ప్రతిదినమును జాగరూకతతో వివిధమైన చెట్లను గమనించుచుండవలెను.

వివిధవృక్షములు వివిధస్థలములయందు పెరుగును. వివిధకాలములయందు చిగుర్చును. పుష్పించును. కొన్నిచెట్లు యిండ్లవద్ద సాధారణముగ కనబడును. మఱికొన్ని అడవులయందు దృగ్గోచరమగును. ఇట్టిభేదములను గమనించుచుండిననేగాని తప్పులులేక వ్రాయుట యసంభవము. ఏలయన: తాను బోధపఱుచుకొనినది చిత్రకారుడు వ్రాయజాలడు. వేయేల? చెట్లు వానిస్నేహితులు కావలయును.

చెట్లుయాకారములు:- చెట్లు బల్లపరుపుగా నుండక గుండ్రముగ నుండును. ముఖ్యాధార మైన వేళ్లచే భూమియందు వృక్షము నాటబడియుండును. సాధ్యమైనంతవఱకు దీనిమొరడు తిన్నగ లేచుటకు ప్రయత్నించును. ఈ మొరడునుండియే కొమ్మలు లేచును. ఈకొమ్మలు మొదట వలముగాను పైకి వెళ్లినకొలది సన్నముగాను పరిణమించును. ఈసన్ననిభాగములయందు ఆకులు, పుష్పములు, పండ్లు మొదలగునవి కనబడును.

మనము చెట్లతో పరిచయము కలుగజేసికొనవలయునన్న మొదట వాటియొక్క వేళ్లు, మొండెము, కొమ్మలు, ఆకులు, ఫలములు మొదలగువాటివిషయమై కొంచెము నేర్చుకొనవలయును. ఇవి పైకి యెటుల కనబడునో అటుల వ్రాయవలెను. ఐనప్పటికిని వాటియొక్క జీవనము విషయమై కొంచెము నేర్చుకొనవలయును. కొమ్మ లెందు కటుల పెరుగునో అవి యెట్టిచర్మముచే కప్పబడియుండునో, దీనియొక్క ఆకార మేమియో ఏయేస్థలముయం దెటుల పెరుగునో నేర్చుకొనవలయును.

కొమ్మలు మొండెములనుంచి పెరుగును. ఇది మొండెమునుండి వెలువడునప్పు డనేకకోణములకు కారణమౌను. ఈకోణములు వివిధవృక్షజాతులనుబట్టి యుండును. గుగ్గిలపు చెట్టుయొక్క కొమ్మల కోణములు (angles) మామిడికొమ్మలకోణములకంటె చిన్నవిగ నుండును. కొన్నికొమ్మలు సమకోణములుగనే వెలువడును.

అడవియందు చెట్లు స్వేచ్ఛగా పెరుగును. మనుష్యసంచార ప్రదేశములయం దిటుల పెరుగజాలవు. ఏలయని మీరు నన్నడుగవచ్చును. మనుష్యులు చెట్లకొమ్మలను నఱికివేయుదురు. పశువులు దిగువనున్న కొమ్మలయాకులను భక్షించి కొమ్మలను కుఱుచగ చేసివేయును. ఇట్టిమార్పులు అడవియం దుండు చెట్లయందు కానరావు.

పర్వతములమీదను పెరుగు చెట్లకొమ్మలు మీదికి వంగియుండును. చదునగు నేలయందు పెరుగు చెట్లయందీమార్పులు కానరావు.

ఋతువులనుబట్టి యీచెట్లు చాలవఱకు మాఱుచుండును. శీతకాలమందు ఆకులను రాల్పును. వసంతమునందు చిగుర్చును. కొన్నిసమయములయందు కొన్నిచెట్లు చిగుర్చును. మఱికొన్ని సమయములయందు కొన్ని చిగుర్చును. కాన వీటివీటి నైజగుణములను జాగరూకతతో గమనింపవలెను. కొన్నిచెట్లు రాత్రులయం దాకులను