పుట:2030020025431 - chitra leikhanamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైఁజెప్పినవాని నన్నిటిని వ్రాసివేయవచ్చును; కాని అవి యెటుల కనబడునో యటుల వ్రాయుట కష్టము. దీనికి ఛాయయే ముఖ్యము. వీనికి రెండు కుంచెలు కావలసియుండును. ఒకకుంచెతో రంగును వేయుచు రెండవ కుంచెను నీటియందు ముంచుచు తుడుచుచుండవలెను. అనగా రంగును సన్నని కుంచెతో నొకధారవలె వేయుచు నీటితో దానియొక్క కొనను తుడిచిన ఛాయ శుభ్రముగ వచ్చును.

మొదట హెచ్చుతగ్గులుగ వచ్చును. అభ్యాసమైన కొలది చదునుగా రంగును వేయగలుగుదురు.

ఒకఫలమును వ్రాసి దానికేదైన నొకరంగును వేసి ఛాయ నియ్యవలెను. పుష్పములను వ్రాయుటయందు నిటులనే చేయవలెను. ఛాయ నియ్యనిది పుష్పము కళా విహీనముగ నుండును. ఈఛాయ సూర్యుని వెలుతురు వలన జన్మించుచున్నది. ఏలయన: ఒకవైపున సూర్యుడు ప్రకాశించునప్పుడు మఱియొకవైపున చీకటిగ నుండును. రాత్రులు, పగళ్లు కలుగుట కిదియే కారణమని మన భూగోళశాస్త్రజ్ఞులు చెప్పియున్నారు. వస్తువుయొక్క యొక వైపున సూర్యుడు ప్రకాశించిన రెండవవైపున చీకటిగ నుండును. అందువలన నేదైన చిత్రమును వ్రాయునప్పుడు చాయ నిచ్చుచుండవలెను. 30 - చూడుము.

ఇందభ్యాసమైన తరువాత చిన్నప్రదేశచిత్రములను వ్రాయుచుండవలెను. ఇదివఱకు మీరు చెట్లనువ్రాయుట నభ్యసించితిరి. కనుక చిన్నచెట్లతోను పర్వతములతోను చిత్రములను వ్రాయుట సులభమని నాతాత్పర్యము. ఈ ప్రదేశచిత్రములను వ్రాయుటయందు చాల సంగతులను గమనింపవలెను. కాని ప్రారంభకులు సాధారణముగ వ్రాసిన చాలును. ఆనిబంధనలకు లోబడనియెడల ప్రదేశ చిత్రములను వ్రాయుట సులభమైనపనియే. అభ్యాసమైన కొలదిని వానినన్నిటిని గమనింపవలసియుండును. ప్రారంభకులే యట్లు చేసినయెడల వారెప్పటికిని మంచి చిత్రములను వ్రాయజాలరు. నేనిదివఱకే చెప్పియుంటిని. సంగీతములో ప్రారంభమున కృతులనే నేర్పించినవానికి సంగీత మబ్బునా? అబ్బినను వట్టి సంగీతజ్ఞానశూన్యుడగును.