పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 82

నవీన నిఘంటువులు

నవీనయుగము ప్రారంభమైన వెనుక ప్రాచీన నిఘంటువులు నవీన విద్యాప్రణాళికకు సరిపోలేదు. అందుచే నూతనరీతిని నిఘంటువు లేర్పడవలసిన యావశ్యకత కలిగినది. పద్యరూపమునకాక వచనరూపమున నిఘంటువులు రచితములు కావలసి వచ్చెను. అం దకారాదిగా పదములు సరికూర్చి యర్థము నెదురుగ వ్రాసినఁగాని జనబాహుళ్యమునకు, విద్యార్థిలోకమున కుపయుక్తములు కావు. అట్టివానిలో మొట్టమొదట వెలువడినది మామిడి వెంకయ్య యను ప్రసిద్ధ వైశ్యపండితుఁడు రచించిన 'ఆంధ్ర దీపిక' యనునది. ఇది. క్రీ. శ. 1816 లో రచితమై 1849 లో ముద్రితమైనది. ఈకాలముననే ఆంగ్లేయులుకూడ తెనుఁగు నభ్యసించి, తెనుఁగునకు నింగ్లీషుభాషలో నిఘంటు రచనమును వ్రాయుట ప్రారంభించిరి. అట్టివారిలో కాంబెల్ అను నాతఁడు ముఖ్యుఁడు. ఈతఁడు 1821 లో కాంబెల్ నిఘంటు వనుపేర తనగ్రంథమును ప్రకటించెను.

దీని వెనుక ఆంధ్రభాషోద్ధారకుఁడై మహాప్రసిద్ధిచెందిన బ్రౌను మహాశయుఁ డొక పెద్దనిఘంటువు నిర్మించెను. ఇదియే బ్రౌను నిఘంటు*[1] వనుపేరఁ బరఁగుచున్నది. ఇది 1852 - వ సంవత్సరమున నచ్చొత్తింపఁబడినది. అంతకుముందు నిఘంటువులకన్న నీ నిఘంటువునందు రెండు మూఁడు విశేషములు కలవు.

  1. * ఈ యపూర్వ నిఘంటువును నేఁ డాంధ్ర సాహిత్య అకాడమీ వారు పునర్ముద్రణము గావించుచున్నారు.