పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 50

ఇట్లనేక నూతనపద్ధతులను వచనరచనయందు నెలకొల్పి తన యనుయాయులకు మార్గదర్శకుఁ డగుటచేతనే యాంధ్ర వాఙ్మయమున చిన్నయసూరి నీతిచంద్రికలు సకలబుధాహ్లాదకరములై యాచంద్రార్క మభినందనీయము లగుచున్నవి.

వచనరచన - లక్ష్యలక్షణ సమన్వయము

ఈ గ్రంథము తనవ్యాకరణమున కెట్లు చిన్నయసూరి లక్ష్యముగా నిరూపించినాఁడో యీ క్రింది యుదాహరణమును బట్టి గ్రహింపనగును.

"ఎవ్వఁడు హంసములను శుకములను మయూరములను శుక్ల హరిత చిత్రములఁ గావించె నా యీశ్వరుఁ డాయాయి జంతువులకుఁ దత్తదను రూపమైన వృత్తిని గల్పించువాఁడు. మూఢు లీయర్థ మెఱుఁగక వృత్తికయి పడరానిపాట్లు పడి కాలము వ్యర్థముగాఁ బోఁగొట్టుచున్నారు. విత్తము గడనయం దొక దు:ఖము, కాఁపుదలయం దొక దు:ఖము, వినాశమం దొక దు:ఖము పుట్టించుచున్నది. ఇట్లు దు:థైకమూలమైన విత్త మేల? కాల్పానా! ధర్మార్థము ధనము గోరుటకంటె నిస్పృహత్వము మంచిది. 'అడుసు ద్రొక్కనేల, కాలు గడుగ నేల?' ఆకాశమునందుఁ బక్షులచేత, భూమియందు వ్యాళములచేత, జలములయందు మీలచేత మాంసము భక్షింపఁబడినట్లు సర్వత్ర విత్తవంతుఁడు భక్షింపఁబడియెడును. కాఁబట్టి ధనతృష్ణమానికోలు వివేకకార్యము. తృష్ణ యొకటి మానెనా యావల దరిద్రుఁ డెవఁడు, ధనికుఁ డెవఁడు? దాని కెవ్వఁ డెడమిచ్చును? వాని మూర్ధమే దాస్యమునకు సింహాసనము. నీ సన్నికర్ష ప్రభావముచేత నా యజ్ఞానము సర్వము నివర్తించినది. కృతార్థుఁడనైతిని. నిరంతరముగా నీతోడిసంగతికంటె నాకు లాభ మొకటిలేదు. నీతోడి ప్రణయమున కొక్క కొఱఁతయు రాఁబోదు. ప్రణయము లామరణాంతములు, కోపములు తత్ క్షణభంగురములు, త్యాగములు నిశ్శంకములు నగుట మహాత్ములకు సహజము."