పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 49

గ్రంథముద్రణ పద్ధతి

నీతిచంద్రికను చిన్నయసూరి స్వయముగా 'వాణీదర్పణ' మను ముద్రాక్షరశాలయందు ముద్రించినాఁడని తెలిపితిని. అందుకు కారణము ముద్రణమునందు కొన్నిమార్పులు తెచ్చుటయే. ఈ మార్పుల నీక్రింద సూచించుచున్నాను.

1. రేఫసంయుక్తాక్షరము వలపలగిలక (౯) తో వ్రాయుట. అనఁగా "అథ౯ము" నిట్లు వ్రాసెడివారు. చిన్నయసూరి దానిని "అర్థము" అను నవీనరీతిగా ముద్రింపించినాఁడు.

2. పూర్వము నిండుసున్న (పూర్ణానుస్వారము) లే యన్నిచోట్ల నుపయోగించెడువారు. చిన్నయసూరి ఆ పద్ధతిని వీడి యర్ధానుస్వారపద్ధతిని ప్రవేశ పెట్టినాఁడు.

3. తత్పూర్వము ద్రుతమునకు నకారపొల్లు నిచ్చెడువారు (౯). సూరి దానిని విసర్జించి స్వత్వరూపమునఁగాని, ('ను' ), బిందురూపమునఁగాని, సంశ్లేషరూపమునఁగాని(న్గ) యుపయోగించి తనవ్యాకరణసూత్రమునకు లక్ష్యముగా చూపినాఁడు.

4. శకట రేఫసాధురేఫలను సక్రమముగా పాటించినాఁడు సంయుక్తాక్షరములయందు వర్ణక్రమనియమమును సరిగా పాటించినాఁడు. పూర్వము "విఛిన్న" "ఉజ్వల" "తత్వము" అని వ్రాసినవానిని సూరి "విచ్ఛిన్న" "ఉజ్జ్వల" "తత్త్వము" అని వానిరూపములను పరిష్కరించినాఁడు.