పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 15.

ఓనమాలను వ్రాసియిచ్చి చిన్నయను వ్రాయమని కోరిరి. ఆతఁడు తడుముకొనకుండ నటులనే తిరిగి వ్రాసెను. దానిని చూచి 'యీ బాలుఁడు బుద్ధిమంతుఁ'డని గ్రహించి అచ్చులను, హల్లులను వ్రాసియిచ్చిరి. గురువుగారు భుజించివచ్చునంతలో చిన్నయ వాని నన్నింటిని చక్కఁగా వ్రాసి చూపెను. ఆచార్యులవారు చాల సంతోషించిరి. చిన్నయ హృదయక్షేత్రమున నీరీతిగా నాటఁబడిన విద్యాబీజములు మెఱపుతీఁగెలవలె నతిస్వల్పకాలములో చక్కఁగా వృద్ధిచెంది పుష్పించి ఫలించినవి. పదునాఱేండ్లవఱకు పాండిత్యవాసనయే లేని బాలుఁడు ముప్పదేండ్లకు లోపుననే సాహితీసముద్రమును మథించి పాండిత్య పర్వతశిఖరము నధిరోహించినాఁ డన్న విస్మయావహముకదా! ప్రతిభాశాలురకు పుట్టుకతోడనే ప్రజ్ఞావిశేషము గలుగు నను సూత్ర మీతనియెడల ననువర్తింప లేదు.

సహజముగా గురువులయం దుండెడి భక్తిచేతను, చదువునందలి శ్రద్ధచేతను చిన్నయ త్వరలోనే గుణింతమును, వాక్యలేఖనమును నేర్చెను. లేఖనముతో కూడ వాచకత్వము నలవఱచుకొనుటకు పద్యములు, శ్లోకములు చదువుట ప్రారంభించెను. ఆకాలమున నిప్పటివలె వీథిబడులు, పాఠశాలలు విశేషముగా లేవు. గురువుల వాసగృహములే విద్యాస్థానములు. చదువులు చాలవఱకు లిఖితపుస్తకరూపమునఁగాక వాగ్రూపముగానే యుండెడివి. చిన్నయ యీ పద్ధతి ననుస