పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 14

ఇట్లుండ నొకనాఁడు తండ్రిస్నేహితులగు కంచి రామానుజాచార్యులవా రితనినిఁజూచి "చదువులేని యీబాలుఁ డెవఁ" డని ప్రశ్నించిరి. విద్యాగంధము లేని బాలుని తన కుమారుఁ డని చెప్పుటకు తండ్రి సంకోచించెను. కాని రామానుజాచార్యులవా రా బాలుని పిలిచి, "నాయనా! మీతండ్రి గారు వయోవృద్ధులేకాక గుణవృద్ధులు, గురుపదారూఢులు నై యున్నారు. మావంటివా రెందఱో వారివద్ద శుశ్రూష లొనర్చి విద్యావంతులై నారు. అట్టి మహా విద్వాంసుని కడుపున నీయట్టి నిరక్షరకుక్షి జన్మించినాఁడు. నీకై నను బాల్యదశ గడచిపోయినది. ఇంకనైన నాలుగక్షరములు నేర్చుకొనకుండ వృధా కాలక్షేపము చేసినట్లయిన నీ తలిదండ్రులకు చెడ్డపేరు తెచ్చెదవు సుమా!" అని చీవాట్లు పెట్టిరి. ఆ మాటలు చిన్నయకు వాడిములుకులవలె మనమున నాటెను. అతడు నాఁటి నుండియుఁ దదేక దీక్షతో చదువుటకు పూనుకొనెను. తత్క్షణమే తండ్రిదగ్గఱ కరుదెంచి తనకు పాఠము చెప్పు మని కోరెను. అతఁడు తన స్నేహితులును, శిష్యులును నైన కంచి రామానుజాచార్యులవారికి చిన్నయకు చదువు నేర్పుటకు నొక జాబు నిచ్చెను. దానిని తీసికొనిపోయి చిన్నయ వారి కందిచ్చెను.

రామానుజాచార్యులవా రా జాబుచూచి "నీవు చదువు వాఁడవా? నాకు చాల సందేహముగా నున్నది" అనిరఁట. కాని చిన్నయ తాను, తప్పక, చెప్పినట్లు విని చదువుకొనెదనని బదులుచెప్పినంతనే యాచార్యులవారు ఇసుకయందు మొదట