పుట:2015.393685.Umar-Kayyam.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ఉమర్ ఖయ్యామ్

212

ఆయువు చెల్లిపోవు పవనాహతి నున్నది మిత్తిచేతిలోఁ
గాయము వాయుకాల మురగంబయి పైఁబడనున్న దిఁక నొ
తోయజనేత్రి ! సంతసముతోఁ జషకంబునఁ దెచ్చి యిమ్ము మై
రేయము ; జాగు చేసినను మృత్తిక కానయియుంటి మియ్యెడన్.

213

వయసను దుస్తు నవ్యమును భవ్యము నై యలరారఁబోవ దా
రయ జగ మెప్డు నీయవసరంబులు కోర్కెలు దీర్పఁ బోదు ; ని
శ్చయ మిది, దుఃఖశాంతి కలశంబులఁ ద్రావుమి మద్య మింక నీ
మెయికలశంబు బ్రద్దలయి మృత్తికతోఁ గలశంబు లయ్యెడున్.

214

ఏ నొక భూబిలంబున వసింపక పూర్వమె నాశరీరపున్
రేణువులెల్ల మట్టియయి రేగక పూర్వమె యో సురా ! ఘటా
ధీన సమాధి వీడి చనుదెమ్ము ! నినున్ గని చచ్చియున్న యీ
మానసజీవముల్ బ్రదుకు మార్గము లేర్పడునేమో చూచెదన్.

215

రేయను నీలచర్మము హరించె నుష స్సిది ; నిద్ర లేచి నీ
తోయజపత్ర నేత్రములతోఁ గనవేమి, మనోహరాంగి ! మై
కేయముఁ దెమ్ము ; ముందు నిదురింపగవచ్చును బెక్కునాళ్ళు వా
పోయి సమాధిలో నిఱికి భూబిలమందు శవంబు పేరిటన్.