పుట:2015.393685.Umar-Kayyam.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

53

208

కోపము నిన్నుఁ బట్టుకొనకుండఁగ దుఃఖము నిన్ను జన్మసం
తాప దవాగ్ని వ్రేల్పఁగ వ్యధన్ జెడకుండ, ధరిత్రికొంగులో
గాఁపుర ముండుకోఁ దలఁచు కాలము పైఁబడకుండ, శీధువున్
రేపవ లారగింపుము సరిత్తట శాద్వలపుణ్యభూములన్.

209

ఱేపె వియోగ మాఱును ; నదృష్టసుమంబులు వీడనున్న వీ
మాపు ప్రశాంతమై వెలయు మద్యము ద్రావెడువేళ వచ్చె నీ
వైపు ప్రసన్నయై వెలఁది పాడుచు నున్నది యిట్టిసౌఖ్య మి
ప్డే పడయంగలేనియెడ నెప్పుడు పొందెదవో వచింపుమా.

210

పువ్వులఁబోలు నట్టి పువుబోణులనే జతగూడ నెంతు ; నే
రవ్వయినన్ సురాసవము గ్రాలెడుపాత్రలఁ గేలఁ దాల్తు ; నీ
జవ్వన మీశరీరమున జాఱకమున్నె ప్రపంచసౌఖ్య మే
నెవ్విధినైన నేఁ డనుభవించెద ; ఱేపు నశింపకుండగన్.

211

చారు నదీతటంబులను, సైకతసీమల, శాద్వలంబులన్
జేరి, జగంబు మై మఱచి శీధువు గైకొని సంచరింపు ; మీ
ధారుణి జీవితంబు సుమదామముకైవడి మూడునాళ్ళదై
జాఱును గాన నవ్వుచునె సాగుము పుల్లసుమాళిఁ బోలుచున్.