పుట:2015.393685.Umar-Kayyam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చం. పరమపవిత్ర యీ వెలది పండితురాలు నితాంత సత్యసం
      భరిత రసాత్మక ప్రకృతి వడ్డికిబారెడు ప్రేమమూర్తి సుం
      దర సముపాసితం బయిన ధర్మ పదంబును సంతరించి యీ
      శ్వరునెద నగ్బరాంబ కడు ప్రార్థనసేయుచు నెల్ల వేళనన్.

శా. పల్లెన్ బుట్టిన ఢిల్లిలో బ్రిటీషుసామ్రాజ్యంబు పాలించు వా
     రెల్లన్ వచ్చి సమాధిజేసిరి భవన్మృత్యున్ విచారించి యో
     పుల్లాబ్జానన 'అగ్బరాంబిక' భవత్పుణ్యంబు దేశాల రా
     జిల్లున్ విచ్చిన కుండఁబోలె వెస నే జీరాడుచున్నా నిటన్.

చం. హృదయము ముక్కలౌనటుల నేడ్చు చుఁ గన్నులనీరు కాల్వలై
     చెదరఁగ నిమ్నలోకములఁ జేరుటకంటె సమాధితొంటి నీ
     సదనము జేరుమార్గము విచారణజేయుట లెస్స యైహికా
     స్పద విభవానుషంగభవబంధమువాసిన నిన్ను చూడఁగన్.

శ్రీ కవిగారు యిస్లాంమతస్థులు. వీరి మాతృభాషఉర్దూ. ఆంధ్ర భాష మాతృభాషగా కానివారు తెనుఁగున సరసకవిత్వముఁ జెప్పిన వారు ఈ కవిగారొక్కరే వీరు రచించిన మహాభారత కౌరవరంగ మను నాటకమున -

నాటకముల్ ప్రబంధము లనంతముగా రచియించి వాణి కా
వ్యాటవి భావవీధుల విహార మొనర్ప జయధ్వజంబు వా
గ్వీటిని నిల్పినట్టి జనవిశ్రుత ఉం రలీషా కవీంద్రుడున్..."

అని వ్రాసిరి.

వీరు రచించిన గ్రంథము లేబదివరకున్నవి. శ్రీ కవిగారు తమ శిష్యులకు దర్శన మిచ్చుటకై నరసాపురము (పశ్చిమ గోదావరిజిల్లా) వెళ్ళి అచ్చట తేది 23 జనవరి 1945 వ నాటి సాయంత్రము 5 గంటలకు దివి నలంకరించిరి. వీరి భౌతికదేహమును పిఠాపురముఁ దెచ్చి 24 వ తేదీ సాయంత్రము రైలుస్టేషనువద్ద నున్నవారి యరామములో సమాధి చేసిరి.