పుట:2015.393685.Umar-Kayyam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్‌ఖయ్యామ్

1

ఈ "ఉమర్‌ఖయాం" అనునతడు సుప్రసిద్ధుఁడైన పారశీక కవి. క్రీస్తుశకము 1018 సం. పెరిషియాదేశమున నైషాపూర్ అను గ్రామమున జన్మించెను. ఈతని తల్లిదండ్రు లిస్లాము మతమునకు జేరిన వ్యవసాయదారులు. "నైష్" అనగా వెదురు. వెదురు భిడమును దొలగించి కట్టిన పల్లె యే 'నైషాపుర' మని ప్రసిద్ధి వహించినది. ఇది ఖురాసాన్‌దేశపు చక్రవర్తుల కాలమున బలఖ్, హిరాత్, షాజహానులతో పాటు నైషాపురమును రాజప్రతినిధినివసించు ముఖ్యస్థానమై యుండెను. ఇందెన్నియో కళాశాలలు నిర్మింపబడి యుండెను. బాగ్దాదులోని పెద్ద పెద్ద విశ్వవిద్యాలయములకన్న నీనైషాపురమున పెక్కు విశ్వవిద్యాలయములు నిర్మింపఁబడినవి. అందునిజాముల్ ముల్కుతూసి "బేహఖియా" నిజామియా నైషాపూర్, మహమూద్ గజినీ సోదరుఁడు "సైదియా" ఇట్లే ఆబూసెద్ బగ్దాదీ, ఆబూ ఇసహాఖ్ మున్నగు ప్రసిద్ద పురుషులచే నెన్నియో కళాశాల లీనైషాపురమున నిర్మింపఁబడినవి. అందు అరబ్బీ మహావిద్వాంసుఁడగు "ఇమామెగజ్జాలి" నైజామియా విశ్వవిద్యాలయమునకుఁ బ్రధానాచార్యుడు (Chancellor) గాఁగొన్ని నాళ్ళుండెను. ఉమర్‌ఖయ్యామ్ ఇందు త్తీర్ణుఁ డగుటయేకాక లోకమున నెచ్చ టెచ్చట గొప్పవిద్వాంసులున్నారని విన్నను అచ్చటకుఁ బోయి తర్కవ్యాకరణాదులు జ్యౌతిషములు సంపూర్ణముగ నేర్చుకొనియెనని "ఇబ్నెఖల్ కాన్" అను చరిత్రకారుడు వ్రాయుచున్నాడు. ఈతని సహాధ్యాయులు హసన్ బిన్‌సభా, నిజాముల్ ముల్కు అను ప్రసిద్ధపురుషు లిరువురుండిరి. వీరినిగూర్చి యొక విచిత్రకథగలదు. వీరు చదువుకొను కాలమున హసన్‌బిన్‌సభా 'మన మువ్వురిలో నెవరి కదృష్టము పట్టినను