పుట:2015.393685.Umar-Kayyam.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఉమర్ ఖయ్యామ్

107

ఆనందప్రతిబింబమే కలదు నీ యాత్మన్, భవత్మాణిలోఁ
బానార్హంబగు శీధుపాత్ర గల దాపాత్రన్ విసర్జింప కో
జ్ఞానీ ! నీ కిల దీనికన్న నిఁక విశ్వాసార్హుఁడౌ మిత్రుఁడున్
లేనేలేఁడు సుమా యథార్థమిది వేలీలన్ వితర్కించినన్.

108

చెలి యిలఁ జిల్కరించు ప్రతి శీధుకణంబు హృదంతదుఃఖ కీ
లలఁ బరిమార్చుచుండె నహ ! లాతిజనం బిది వట్టినీళ్ళుగాఁ
దలఁచు నపోహలం దవిలి దారుణ ఘోర హృదంతరాళ చిం
తలఁ దొలఁగించుచున్న దిది తథ్యము గాలికబుర్లి కేటికిన్.

109

వృథగా దుఃఖముఁ జెందనేల విధి యీవిశ్వంబులో నెందఱన్
బృథివిన్ గూలిచి మన్ను చేసినదియో విశ్వజ్ఞ ! లే వేగమే
మధుపాత్రన్ గొని నా కరాన నిడుమా మద్యంబునే త్రావెదన్
విధి యేరీతిన్ నున్న నాగతియగున్ వేయేండ్లు చింతించినన్.

110

మద్యపానాప్తి ధనికులే మాయుచుంద్రు
వీరియార్భాటమునఁ బ్రజ విసుగు ; దాని
విడిచి, దుఃఖాహిగ్రుడ్డిదై వెడల హుక్క,
వజ్ర పేటికలోఁ బచ్చవాడుచుంటి.