పుట:2015.393685.Umar-Kayyam.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

29

111

విధి నాముందు శిరంబు వంపవలె నావిశ్వైకసంజీవితా
వధి యెంతే నభివృద్ధిఁ గాంచుటకు నై వాంఛింతు వట్లైన వీ
మధువున్ నావలెఁద్రావ నేర్చికొని నామార్గాన వర్తించి దు
ర్వ్యధలన్ దోలుము నమ్ము నావచన మత్యంతంబు విశ్వాసివై.

112

స్వర్గమునుండి యీధరకు వచ్చినవాఁడవె యున్ననాళ్ళు నీ
దుర్గతి దుఃఖసంకలిత దోషవివేచన మాని మిత్రుఁడా
భర్గుఁ డొసంగునట్టి మధుపానము సేయుము రెండులోకముల్
నిర్గతకర్మమై వెతల నీఱయిపోవుఁ దరింతు వన్నిటన్.

113

మృతికొకదారి లేనియెడ నీ మధుపానమె సేయనిమ్ము జీ
విత మతి స్వల్ప మీవ్యవధి విహ్వలచిత్త విచారఘోర దు
ర్గతులను బొంది పొంది కలకాలము స్రుక్కి నశించి యేడ్వ నా
మతి సహియింపకున్న దిఁక మానిని ! దీనిని మాన్పఁబోకుమా.

114

ఆవనిని గొన్నినాళ్ళు బ్రతుకాశ వహించితివేని, నందులోఁ
బ్రవిమల చిత్తవృత్తి నిజభావమునన్ వ్యసనంబులేని యు
త్సవమును, సౌఖ్య మున్నతి నిజంబుగ నొందఁ దలంచితేని నా
సవమును ద్రావు మెప్పుడును సార్థకజన్ముఁడ వౌదు వాగతిన్.