పుట:2015.393685.Umar-Kayyam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయావచ్ఛక్తి నుపయోగించి నిన్ను వీక్షించుచున్నాను. నన్ను క్షమింపుము....." అని తుదిప్రార్థనలను సలిపెను.

ఉమర్ ఖయ్యాం హిజరి 516 (క్రీ. శ. 1122) మొహరం నెల 12 వ తేదీ గురువారమునాఁడు దివి నలంకరించెను. నైషాపురమున మహాత్ముఁడైన ఉమర్ ఖయ్యామ్ గోరీపై ప్రకృతి యెల్లప్పుడు పుష్పములను గురిపించుచుండెను.

....... ........ ......... ........ ........ ......... .......... ........ ......... ......... ........ ........ ........ .........

శ్రీ ఉమర్ అలీషాకవిగా రీగ్రంథమును 1926-28 సం. ల మధ్య ఆంధ్రీకరించిరి. వీరి కప్పుడు లభించిన పారశీక మూలగ్రంథమునందు 720 రుబాయీలవరకుఁగలవు. అందు శ్రీకవిగారు 714 రుబాయీలు తెనిఁగించిరి. ఈ గ్రంథము వీరిజీవితకాలమున నచ్చపడు భాగ్యము లేకపోయినది. వీరి జీవితకాలమున నచ్చుపడనిలోపము లేకపోలేదు ; ఏలయన శ్రీకవిగారు తమ గ్రంథము లచ్చగునప్పుడుసవరించుచుండిరి. వీరీగ్రంథ మాంధ్రీకరించినప్పు డనేకపద్యము లనేకపత్రికలందు బ్రకటింపఁబడినవి. అందుకొన్ని బొంబాయి వాస్తవ్యులు, పారశీకులు, శ్రీ జంషీదు జీ. ఇ. సక్లత్ వాలాగారు చూచి శ్రీ కవిగారితో ఉత్తర ప్రత్యుత్తరములు నడపి కవిగారి ప్రియమిత్రులైరి.

ఉమర్ ఖయ్యామ్ వ్రాసిన పద్యములు రెండువేల వఱకు కల వందురు ఇప్పటికి 1360 లభ్యమైనవి. అందు 1096 సరియైనవని శ్రీ స్వామిగోవిందతీర్థ నిర్ణయించివాటినన్నిటిని ఆంగ్లమునను, మహారాష్ట్రమునను అనువదించిరి. శ్రీకవిగారి జీవితకాలమున తక్కిన రుబాయీలుగల పుస్తకము లభ్యము కాకపోవుటచే వాటిని తెనిగించు నవకాశము లేకపోయినది.