పుట:2015.393685.Umar-Kayyam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జదివి యప్పటి అరబ్బీపండితులను గెల్చినాఁడు. ఆనాఁటి పారశీక చక్రవర్తియైన సుల్తాన్ మాలిక్ షా యితనిని 'నాదిమ్‌' గా నెంచుచుండెను. 'నాదిమ్‌' అనగా వివిధ భాషావిశారదుఁడు. సకలకలాకోవిదుఁడు, నానావిధశాస్త్రపండితుఁడు, సర్వజన పూజితుఁడు, నిష్ఠాగరిష్ఠుఁడు, మతాచారపరాయణుఁడు, చతురంగాది యాటలందాసక్తుఁడు, గానాదిలలిత కళలందు నిపుణుఁడు, విశ్వసనీయుఁడు, అమాత్యపదవికి నర్హుఁడు, అయి యుండవలెను. ఉమర్ ఖయ్యామునం దీవిశేషగుణములన్నియు కేంద్రీకరింపఁబడి యుండెను. ఇతడు జనులతో విశేషముగా సంపర్కము పెట్టుకొనక పవిత్ర జీవితమును గడపెను.

ఇతఁడు క్రీ. శ. 1100 సంవత్సర ప్రాంతమున మక్కా నగరమునకు 'హజ్‌' చేయుటకై వెళ్ళెను. అచ్చటినుంచి తిరిగి వచ్చునపుడతడు బాగ్దాద్ పట్టణమునకు వెళ్ళెను. అప్పటికే యతని కీర్తిచంద్రికలు దశదిశలు వ్యాపించుటచే నాపట్టణపు జన లితని రాకవిని పురమునంతయు నలంకరించి యితనిని మిక్కిలి గౌరవించిరి. ఇతఁడు 1103 సం. ప్రాంతమున యాత్రముగించుకొనివచ్చి ప్రాపంచిక వ్యవహారములతో సంబంధము విడిచి యేకాంతవాసమున శేషజీవితమును గడపెను. ఇతఁడు తనయంత్య దినమునవఱకు మిక్కిలి యారోగ్యవంతుఁడై యుండెను. ఇతఁడు మరణించునాఁటి యుదయమున 'అవిస్సినా' యను అరబ్బీ తత్త్వవేత్త వ్రాసిన 'అష్షఫా' అను గ్రంథమును జదువుచుండెను. అందు 'ఒకడు మఱి అందఱు' అనే ఘట్టము వచ్చినప్పుడు గ్రంథపఠన మాపి యుత్తములైన మతాచార్యులను బిల్వనంపి తనయాస్తి యావత్తు వారికప్పగించెను. ఆ దినమంతయు నతఁడు ఉపవాసమున గడపెను. ఆ రాత్రి 'నమాజ్‌' చేసిన తరువాత శిరస్సును నేలకుమోపి "ఓ ప్రభూ !