పుట:2015.393685.Umar-Kayyam.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వింటె యొక నీతి చెప్పఁగా నుంటి, నొరుల
మాయసేయకు స్వార్థంబు మాటుపఱచి
యిహ మశాశ్వత మిట్టి యైహికము కొఱకుఁ
బారమార్థికపదవి గోల్పడగవలదు. 556

నీవు ధరిత్రిఁ గాదువిషయేచ్ఛలకై జనియించినట్లు నీ
భావమునన్ దలంపకుము, వ్యర్థుఁడవై నశియించి పోదు ; వే
తావులనుండి వచ్చితివొ తథ్యము నీవననేమి వస్తువో
నీవిపు డేమొనర్చుటకు నెంచితివో పరికింపు మెంతయున్.

ఈ గ్రంథము చిన్ననాటినుండియు చదువుచు, నైతికజీవనము సలుపుచు, ఈశ్వరభక్తి పరాయణులై మహాజ్ఞానమును బడసినవారు కలరు. ఏది యెట్లున్నను జదువుతక్కువవా రీగ్రంథమును జదువుట సరికాదు. మావి చిగుళ్లు కోకిలకును వర్ష బిందువులు చక్రవాకములకు నేర్పడినట్లు ఉమర్ ఖయ్యాం కావ్యము తత్త్వవేత్తలకై వ్రాయఁబడినది.

ఉమర్ ఖయ్యాం క్రీ. శ. 1048 వ సంవత్సరము మెయి నెల 18 వ తేదీ బుధవారమునాఁడు సూర్యోదయ సమయమున నైషాపురమున జన్మించినాఁడని శ్రీస్వామి గోవిందతీర్థ నిర్ణ యించిరి. ఉమర్ ఖయ్యాం పూర్తిపేరు "గయాత్ ఉద్దీన్ అబుల్‌ఫతా ఉమర్ బిన్ ఇబ్రాహీం" ఇతని బిరుదు "హకీందస్తూర్ ఫిల్ సఫ్ ఇమామె ఖురేశాన్, మాలికల్ హుక్మ హజ్జతుల్ హఖ్." ఉమర్ ఖయ్యామ్ ఆస్తికుడు, దీక్షాదక్షుఁడైన ఇస్లాం మతస్థుడు. ('Omar was a true believer in Islam') ఇతడు అనేక భాషలు నేర్చినాఁడు ; అనేక శాస్త్రములు చదివినాఁడు. ఇతఁడు అరబ్బీ భాష కూలంకషముగాఁ జదివి యందు మహాపాండిత్యమును సంపాదించినాఁడు. ఇస్లాం మతగ్రంథమైన 'ఖురాన్‌' ను అనేక స్వరములతోఁ