పుట:2015.393685.Umar-Kayyam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందు 35 విషయములపై ప్రసంగముగలదు. అవి భగవద్గీతాధ్యాయములవలె వేఱువేఱుచేయఁబడినవి. అత్యంత ప్రాచీనమనదగిన చార్వాకుల పొత్తములు పోయినను ఇదియొక టగుపడుచున్నది. ఇందు వేదాంతము, జీవన్ముక్తి, ప్రపంచము, ధ్యానము, యోగము, తపస్సు, సమాది, కాలము, మానవప్రవృత్తి నివృత్తిమార్గములు, ఈశ్వర జిజ్ఞాస తత్త్వము, మధువు, లోకదుఃఖము, వైరాగ్యము, వివేకము, ఆనందము, సృష్టి, జీవుడు, స్వర్గము, నరకము, సదసత్తులు మాయ, భ్రాంతి మున్నగునవి ముఖ్యములు. మొత్తమన్నిటియందును. విశేషముగ ఆసవపానము, గానము, మానిని, ఏకాంతవాసము, సౌధారామముల గూర్చి పెక్కు భావము లలంకారములతోఁ దర్కించి సాధించి సిద్ధాంత పూర్వ పక్షములలోని నిగ్గును తేల్చి, పరమను దానిని మఱపించి, కైవల్యాదిపదవులు సాకులని యొప్పించి కేవల మైహికమే నిక్కమని పెక్కునిదర్శనము లగుపర్చి తనసిద్ధాంతము నయఃపిండమువలె దృఢతరమును స్థిరతరమును గావించి లోకముచే పాడించి విడిచినాఁడు. ఆ సంబంధమైన భావముల నిసుకతిప్పవలె చెప్పి గుచ్చియెత్తినాఁడు. భూమ్యాకాశమధ్యముననున్న యన్నివస్తువులను సోదాహరణముగఁ జూపించి, ఆస్తిక వాదమును చిందరవందర చేసి పటాపంచలు గావించినాఁడు. ఇది పాశ్చాత్యనాగరకుల కెంతయు సరిపోయినది. అందుచే నాతనిని వారత్యంతము గౌరవించుటయేకాక నాతని యీగ్రంథమును వేదతుల్యముగ సమారాధించుచున్నారు మొన్న నొకపాశ్చాత్యుఁడు ఫిడ్జెరల్డు మొదటి కూర్పుప్రతిని 600 పౌనులకు కొన్నాఁడట. అదిగాక యెందఱో పాశ్చాత్యులు నైషాపురముపోయి యీతనిగోరీనే యర్చించుచున్నారు. ప్రతిసంవత్సరమునచ్చట గొప్ప యుత్సవము సాగుచున్నది.