పుట:2015.393685.Umar-Kayyam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతడు నాస్తికుడని, నామమార్గావలంబుఁడని చెప్పుదురు. నాస్తికులగు పాషండులకును నీతనికి విషయమునఁగూడ రవంతేనియు భేదమగుపడదు. కాని యీతఁడు

శా. వైరుల్ నన్నుఁ బదార్థవాదియని సంభాషింతురే వార లే
     తీరున్ గన్నుటులాండుచుందురొకొయర్థిన్ జెప్పి రూహింప సొం
     పారన్ ధాత్రి కులాయమందు సృజింపన్ వచ్చితిన్ నేను నా
     దేరూపంబని చర్చచేయవలదా యిందేమి తప్పున్నదో.

అనియును ఆస్తికులని చెప్పుకొనువారే వామమార్గావలంబు లనియు, మఱియొకచోట -

ఉ. కోవిదవర్య, శాంతి వినగోరెద నాపలు కీవు నేనునుం
    బోవుచునున్న మార్గ మొకపోలికదైనను వామమార్గమం
    దీ వొకదృష్టినిల్పితివి యెప్పటికైనను దిద్దుకొమ్ము నా
    పై విరసోక్తులాడకు నెపంబులు వీడుమ యీశ్వరార్థమై.

అనియుఁ జెప్పుచున్నాఁడు.

జీవించినన్నాళ్ళు భోగించుటయే దారి. అదే జీవపరమావధి. అని పెక్కు విషయములచే సమగ్రమైన నాస్తికవాదము నిందు పూర్వ పక్ష సిద్ధాంతములచే వ్రాసియందందు శృంగారరసస్వరూపములగు భావములచే పాఠకులహృదయమును మిక్కిలి యాకర్షించినాడు.

ఉ. ఆ రమణీమనోహర ముఖాబ్జము ముంగురు లుంగరాలసిం
    గారము పెట్టి దిద్దితి వికాసముగుల్కెడు ముద్దరాల ! పొం
    పారఁగఁ బొందరా దనెదవక్కట, నిండిననాఁటి పాత్రమున్
    బోరలవేసి నేలపడఁబోలదు నీరును నట్టు లుండదే !