పుట:2015.393685.Umar-Kayyam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాన్‌హమీర్ తనయొద్దప్రతిలో 200 పద్యములు మాత్రమే కలవని వ్రాయుచున్నాడు.

లఖనోప్రతిలో 770 పద్యములు వ్రాయబడియున్నవి.

జాన్ పేన్ అనువానిప్రతిలో 845 పద్యములున్నవి.

మిస్ జే. సి. ఐ కేడిల్ 1200 పద్యములు సేకరించెను. ఇంక నెన్నిపోయినవో తెలియదు. తొలుతఇంగ్లీషులో భాషాంతరీకరించిన వాఁడు ఎడ్వర్డు ఫిడ్జెరల్డు అనిగదాపైన వ్రాసియుంటిని. అతనికి లభించిన ప్రతి యిప్పుడెక్కడను అగుపడకున్నది.

ఈతని తరువాత 1872 వ సంవత్సరమున ఐ. హెచ్. దన్‌ఫీల్డు అనునాతడును, 1898 వ సంవత్సరమున రిచెర్డువీగేలిన్ అనువాడును, 1913 వ సంవత్సరమున జాన్‌సన్‌పాషా అనునాతడు 762 పద్యములును, 1915 వ సంవత్సరమున జాన్‌పాలిన్ 158 పద్యములును, 1920 వ సంవత్సరమున షరబ్ మాల్ 346 పద్యములును ఇట్లే ప్రొఫెసర్ హెర్నిలిక్, మీకార్తిగారజ్ మున్నగు నెందఱో పూర్తిగ అనువదించినారు ; ఇంకను ననువదింపనున్నారు. కాని అసలులోగల ధారాప్రవాహ రూపకమైన, శాంతియుతమైన కవితాప్రభావము, రసపుష్టి, ధ్వని, వ్యంగ్యాలంకారము లొక్కరవంతయురా లేదు. వచ్చుటగూడ సంభవముగాదు. కేవలము భావము మాత్రమువచ్చును. భావము శైలితోఁ గూర్పబడినప్పుడున్న రసమిదమిత్థమని వచింపరాదు. అందుచే నొక ప్రసిద్ధుఁడైన ఇంగ్లీషు కవి ఉమర్ ఖయ్యాం మాతృక యెట్లుండునో యని యిఱువదియేండ్లు పారసీభాష లెస్సగ నేర్చి తరించినాఁడట. మొత్తమున నీగ్రంథరాజము చదువుచున్న నింక నేపొ త్తముపైఁగూడ మనస్సు పోనేరదు.