పుట:2015.393685.Umar-Kayyam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దును బ్రవేశమున్నట్లు చరితల వలనఁదెలియుచున్నది ; తుద కీ మహనీయగుణగరిష్ఠుడైన ఉమర్‌ఖయ్యాం నూట తొమ్మిదియేండ్లు జీవించి తన జన్మభూమియగు నైషాపురమున క్రీస్తు శకము 1127 వ సంవత్సరమునఁ భౌతికశరీరమునువిడిచి దివినలంకరించెను. ఈతనిగోరి "హిరా" అను ప్రదేశమునఁ గలదు. ఒకసారి 'బలఖ్‌' పట్టణమున నేదో వేదాంత వివాదము వచ్చి తన గోరీపైఁ బ్రళయకాల పర్యంతము పూలుకురియు చుండు నని కొన్ని పద్యములు చెప్పెను. అది నేఁటికిని బ్రత్యక్షముగఁ బ్రక్కనున్న మసీదులోని పూలతీవ లల్లుకొని పువ్వులజన్రము కురియుచున్నవని తెలియుచున్నది. ఇట్టివే పెక్కువాఖ్యానము లీతని గూర్చి చరిత్రజ్ఞులు వ్రాసియున్నారు.

ఈతని మతసిద్ధాంత గ్రంథములకు "ఉమర్‌ఖయ్యాం" అని పేరిడినాడని పైనినుడివియుంటిమి. అసలుదానిపేరు "రూబాయియాత్ ఉమర్ ఖయ్యామ్" అనగా ఉమర్ ఖయ్యాంవ్రాసిన రుబాయి లని యర్థము. "రూబాయీ" లన శార్దూలాది వృత్తముల వంటి పారసీ వృత్తములలో నొకదానికిపేరు. ఈవృత్తములలోఁ దనభావములనువెల్లడించెను. ధారాపాతమువంటి యీతని కవిత్వమును, లోకాతీతమైన భావగంభీరతను, ఆలోకసుందరమైన ఉపమానవస్తువులను జూచి విషయ మెట్టిదైనను లోకము మోహించి రససముద్రమున మునిఁగిపోయినది. ఇది తొలుత ఫెడ్జరల్డ్ అనునాతడు 1858 వ సంవత్సరమున ఆంగ్లభాషలో 75 పద్యములలోని కనువదించియచ్చొత్తించినాడు ; కాని దానిపైఁ దనపేరుకూడ వేసికొనలేదు. ఆపొత్తము లమ్ముడుకాకపోవుటచే 5 షిల్లింగులనుండి ఒక పెన్ని వెలకుతగ్గించి బుక్కాదుకాణములవంటి దుకాణదార్లమ్ముచుండిరి. అది తొలుతసర్‌రిచెర్డుబర్‌టన్, సూన్‌బరన్,