పుట:2015.393685.Umar-Kayyam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాంటి, గబ్రియల్, రూస్టుమున్నగువారుకొని చదివి వ్యామోహితులై తమయాప్తునకుఁబంపి విమర్శనములు వ్రాసి దానిప్రాశస్త్యమును వేనోళ్లఁకొనియాడుట కారంభించిరి. తిరిగి యీపొత్తము 1868 వ సంవత్సరము రెండవసారి ముద్రింపఁబడినది. తరువాత 1872 లో మూఁడవ ముద్రణమును జరిగినది. తరువాత 1879 లో రెండు మూఁడుసారులు ముద్రింపఁబడి యిట్లే యేటేట లెక్కలేనన్ని సార్లు వివిధములైన మాదిరులలో ముద్రింపబడుటయే కాక యనేకులనే కానువాదములుచేసియు వ్యాఖ్యానములు వ్రాసియు గౌరవింపఁజొచ్చిరి. ఒక్క యూరపు దేశమందే కాక అమెరికాలో నిదిలేనియిల్లేలేదనునంత వ్యాప్తినిగాంచినది. ఇప్పుడిప్పు డెల్ల దేశములలోను, ఎల్ల ఖండములలోను, ఎల్ల భాషలలోను ననువాదములు బయలుదేఱుచున్నవి.

ఈ ఉమర్ ఖయ్యాం గ్రంథమంతయు నొకచోట లభించలేదు. ఖండఖండములుగ దేశాంతరములయం దుండిపోయినది. ఇప్పటికి దాదాపు 1200 పద్యములు లభించినవి. అసలు కవివ్రాసిన పొత్తమెంతో తెలియదు. అది కాలగర్భమున మునిఁగిపోయినది. ఆ సమకాలికులు వ్రాసిన ప్రతులను నిప్పుడగుపడవు. మిక్కిలి పురాతనమని చెప్పదగిన ప్రతి 1460 వ సంవత్సరమున వ్రాయబడినది. అది బోడ్లిన్ భాండాగారమునఁగలదు. ఇందు 158 పద్యములు మాత్రమే కలవు. దానిని 1898 వ సంవత్సరమున ఎడ్వర్డుహీరన్ అయి ననువాఁడు లండనునగరమునఁ బ్రకటించినాఁడు. పేరీసు నగరమున 1530 వ సంవత్సరమునవ్రాసిన ప్రతిగలదు. ఇందు 76 పద్యములున్నవి. బ్యాంకిపురమున నొక ప్రతి లభించినది. అందు 604 పద్యము లగుపడుచున్నవి.

ఏషియాటిక్కుసొసైటీ (కలకత్తా) వారిగ్రంథాలయమున నొక ప్రతిగలదు. అందు 516 పద్యములున్నవి.