పుట:2015.393685.Umar-Kayyam.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఉమర్ ఖయ్యామ్

220

శ్రేయము లేదు వాదములచేఁ జెడి రుగ్ణత సెందియుండు జీ
ర్ణాయువు నమ్మియీయిహము నందు నెవండుకృతార్థుఁడయ్యె ? మై
కేయము, తోయజాక్షుల వరించి వినూత్న విలాస సంపదన్
హాయిగఁబుచ్చు నొక్కక్షణమైన ఘనంబనియెంచు మెంతయున్.

221

పాడు ప్రపంచదుఃఖములపైఁ దెగ బూడిదఁ బోసివేసి పూ
బోఁడులతోడ మద్యమును బూర్తిగఁ ద్రావుచు సంచరింపుమే
నాఁడు ; "నమా" జదేల వ్రత నైష్ఠికకర్మ మదేల ? చచ్చి పై
కోడకపోయినట్టి నరుఁడొక్కఁడు వచ్చినజాడ యున్నదే.

222

కాలరహస్య మెవ్వరికిఁగాని యథార్థ మెఱుంగనీయ దా
యాలయమందునెందఱు "మహమ్మదయాజులు" వచ్చికూలి పోఁ
జాలిరొ ? యాయువన్న దొకసారిదె ; పోయినవారు మళ్ళి రాఁ
జాలరు ; మద్యపానవివశంబునఁ బుచ్చుము జీవితాంకమున్.

223

ఇదియె ప్రభాతకాలము చెలీ ! యిఁక నిద్దుర లేవ వేమి ? యీ
మదిరను ద్రావి పాడు మల మద్దెల మీటుచుఁ జూచు నీ సభా
సదులు సతంబుగారు ; మనఁజాలరు ; పోయిన మళ్ళిరారు ; సొం
పొదవఁగ నేఁగినట్టి నరుఁ డొక్కఁడు వచ్చెనె చెప్పు మంగనా !