పుట:2015.393685.Umar-Kayyam.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

57

224

రేయఁబగళ్ళు నాయువు హరించుచున్నవి ; యింక ముందు నీ
కాయము మట్టిలోఁ గలుపుఁ గావున సంతసమందె పుచ్చు నీ
వాయువు రెండునాళ్ళె, ధరయందున నీవు తిరంబు గావు, యీ
రేయుబవళ్ళు మాఱవు స్థిరీకృతరీతిఁ జెలంగు నెచ్చెలీ.

225

ఈవు సురాసవాప్తి మదినెంతయు సంతసమొందు ; మింక రా
జీవవిలోల లోచనలఁ జేరి ముదంబున నుండు ; మున్న నీ
జీవిత మెల్ల సంతసముచేతనె పుచ్చుము ; ధాత్రి మిథ్యగా
దీవు వచింతువేని, మఱి నీవును మిథ్యయె గాదె నెచ్చెలీ.

226

కడచిన దుఃఖసంతతులకై వగఁజెందకు ; ముందు వచ్చి పైఁ
బడునను కష్టముల్ దలఁచి బాధ వహింపకు ; నీచమైన యీ
పుడమి ద్వితీయభాగమగు భోగపరంపర లొందు మింక నీ
మెడపయిఁ గాలనాథుఁ డదె మృత్యుకృపాణము నెత్తి వచ్చెడున్.

227

ఓయి "ఉమర్‌ఖయాము" కవి ! యుర్వియ దుఃఖితుఁగన్నయప్డె ప్రా
ధేయతఁ జూపుఁగావునఁ బదేపదె మద్దెల మేళతాళమున్
మ్రోయఁగఁ ద్రావుమీ సురను బోసినభాండము లెత్తియెత్తి ; నీ
కాయపుభాండమే పగిలి ఖండములై పడిపోక పూర్వమే.