పుట:2015.392383.Kavi-Kokila.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

కొనతో సెనగగింజంత హల్వా తీసికొని నోరు మెదల్పక చప్పరించుచుండును.]

రంగా : వెంకటరెడ్డి తలయెత్తక నమలుచుండుట చూచి] మన వాళ్ళకు తినడంకూడా ఒక ఆర్టని ఇంతవఱకు తెలియదు. వాళ్ళు తినడం చూస్తే చాలా బార్బరస్ గా (barbarous)వుంటుంది.

కళ్యాణ : [ఈ రిమార్కు తనకుకూడా అన్వయించునను అనుమానముతో అటుకులు మెల్లగ నములుచుండును.]

వెంకట : దినానికి ఒక్క పూటకూడా కడుపునిండా అన్నము దొరకనివాళ్ళు లక్షలకొలది మన దేశంలో వున్నారు. అటువంటివాళ్ళకు తినడం ఆవశ్యకంగా యేర్పడుతుందిగాని శిల్పంగా వుండదండి.

రంగా : [స్పూను క్రిందపెట్టి చేతి రుమాలుతో మూతి తుడుచుకొని] మీరేమైనా అనండి, ఎక్స్‌క్యూస్‌మి (excuse me) మీ పేరేమండి?

వెంకట : వెంకటరెడ్డి.

రంగా : మిస్టర్ వెంకటరెడ్డి, గాంధీ ఉద్యమం ప్రబలమైనప్పటి నుండి మన దేశంలో చాలా హల్లకల్లోలం బయలుదేరింది. కవిత్వంపైన ఆర్టుపైన ఉత్సాహం తగ్గింది. మొరటుతనం హెచ్చింది.

కళ్యాణ : శాంతిలోవుండే సౌందర్యం పోయింది.

రంగా : ఇదంతా గాంధీకి (aesthetics) ఈస్తటిక్సు, ఆర్టు, తెలియని లోపం. A thing of besuty is a joy for ever అని అన్నాడు కీట్సు. అసలు స్త్రీ ప్రకృతి చాలా సున్నితమైనది; ఆలాంటి మల్లెపూలవంటి స్త్రీలకు మొరటుఖద్దరు కట్ట బెట్టి, వారిచేతికి జెండాలిచ్చి ఎఱ్ఱ టెండలో వీథులు తిప్పించి, లాఠీచార్జీలకు గుఱిచేయించిన