పుట:2015.392383.Kavi-Kokila.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాంకము] సీతావనవాసము 113

విభీషణుని చేతినుండి తప్పించుకొంటిని. ఇఁక నెక్కడికైనఁబోయి నా జీవితశేషమును గడపెద.

[నిష్క్రమించును.]

వాల్మీ : [లేచి నిలుచుండి] ఋషీశ్వరులారా, సకల దేశాధీశ్వరు లారా, ప్రజలారా, పవిత్రచారిత్రయగు జానకీదేవి శూర్పణఖ మూలమున నడవులకు వెడలింపఁబడుట మీరెల్ల రెఱుంగుదురుగదా ! నిండు చూలాలు - కోమలశరీర - రాజకుమారి నిస్సహాయయై యెట్లు కాలముగడపుచున్నదో యెవ రెఱుంగుదురు ?

రాము : మునీంద్రా, హృదయ మర్మభేదకమగు నీవిషయము నేల తలపించుచున్నారు ?

వాల్మీ : ఆసాధ్వీమణి కష్టపరంపరలు విన్నఁ గఠోరచిత్తులైనఁ గంటఁ దడివెట్టకుందురా ? ఇఁకఁ గరుణార్ద్రహృదయులగు మీమాట జెప్పవలయునా ?

ప్రజలు : వాల్మీకిమునీంద్రా, మహారాజ్ఞి దురవస్థఁ దలఁచినంత నే మాగుండె లవియుచున్నవి.

వాల్మీ : అవునవును; అయోధ్యావాసులు సజ్జనులని నాకుఁ దెలియును. సీత యన్ననో కదలమెదలలేని గర్భవతి. వనమా ఘోరమృగా కులము. ప్రాణములు పిడికిటఁబట్టుకొని ఆ యబల యెంతకాలము జీవించి యుండును ?

ప్రజలు : కష్టము ! కష్టము !

మునులు : సీత సుఖించుఁగాక !

రాము : [స్వగతము] అయ్యో ! యీమునీంద్రుని పల్కులు వ్రీలుచున్న నా హృదయమునకు శల్య సంచలనములవలె నున్నవి.

వాల్మీ : శూర్పణఖ తనదుష్కార్య మొప్పుకొనినవెనుక సభాస్థారులలో నెవ్వరైన సీతాదేవి బహిష్కారయోగ్యయని చెప్పఁగలరా ?