పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

536

భక్తిరసశతకసంపుటము


మ.

నరజన్మం బతిదుర్లభం బనుచు నెన్నం బొల్చెగా యందు
భూసురజన్మంబు లభించు టుత్తమమటంచు న్వేదవేత్తల్ వచిం
తురుగా కట్టిద్విజుండు నీదుపదభక్తుం డయ్యెనే న్మోక్షముం
బొరయు న్భక్తివిహీనుఁ డొందఁగలఁడే మోక్షంబు శ్రీమాధవా.

75


శా.

ఏజాతి న్జనియించిన న్మఱియుఁ దా నెచ్చోట వర్తించిన
న్సౌజన్యాకలితాంతరంగుఁ డగుచు న్సద్భక్తితో నుండి నీ
పూజల్ చేసినమానవుండు సతతంబు న్సౌఖ్యముల్ నొందుచు
న్దేజశ్శాలియునై చిరాయువుగ వర్ధిల్లు న్భువి న్మాధవా.

76


మ.

తనయుం డజ్ఞతఁ జేసినట్టి యపరాధంబుల్ విలోకించి త
జ్జనకుం డవ్వి క్షమించినట్లుగను యుష్మద్దాసుఁడన్ నే నొన
ర్చిన నేరంబులు సైఁచి నాపయి దయాదృష్టిప్రసారంబుచే
నను రక్షింపుము దేవకీతనయ కృష్ణా శ్రీహరీ మాధవా.

77


శా.

రంభాదుల్ దనచెంగటన్ నిలిచి యశ్రాంతంబుఁ గ్రీడించినన్
సంభోగాదృతి లేశమైనవిడ దా స్వర్గాధిపత్యం బిఁకన్
జంభారాతికిఁబోలె నను దృష్ణల్ వీడవట్లౌట వి
స్రంభం బొప్పఁగఁ గోరుచుంటిని భవత్సాన్నిధ్యమున్ మాధవా.

78