పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవశతకము

537


శా.

అన్యాయాధ్వమునందు వర్తిలక సత్యజ్ఞానయుక్తుండనై
మన్యూద్రేకసుఖంబులేక గతిసంభావించుచున్ నీదు పా
దన్యాసోద్ధితధూళి నాశిరమునం దాల్తున్ హరేయంచు నే
నన్యుం గొల్వక నీపదాబ్జములనే యర్చించెదన్ మాధవా.

79


శా.

నిన్నున్ లోన స్మరించుమాత్రమున వానిన్ సత్కృపాదృష్టిచే
త న్నీ వెప్పుడుఁ బ్రోచుచుందువని పెద్దల్ చెప్పఁగా మున్ను నే
విన్నాఁడన్ మఱి యార్తరక్షకుఁడ వీవేకాక జేజేలలోఁ
గన్నాకుల్ మది నెన్నగాఁ గలరె నీకన్నన్ హరీ మాధవా.

80


మ.

జననం బందినతోడనే కలిగె యుష్మన్నామసంకీర్తనం
బును నీపాదసరోజభక్తియు భవత్పూజాపరత్వంబు గా
 వున నాకీ వనుకూలదైవమవుగా బుద్ధిన్ వితర్కించుచున్
వినుతింతున్ నిను సంతతంబు మదిలో వేడ్కన్ హరీ మాధవా.

81


మ.

ప్రళయానేహమునందు లోకములు వోవంగా రహిన్ నీవు ని
శ్చలతేజోమయరూపదీపితవిశేషజ్యోతివై యత్తఱిన్
వెలుఁ గేకాకృతి నొందుచున్ జగము లీవే వెండి పుట్టింతువో
జలజాతాక్ష భవత్స్వరూపమె జగజ్జాలం బగున్ మాధవా.

82