పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవశతకము

523


శా.

భూనేతల్ ఘనగర్వయుక్తు లగుచున్ బోషింపకున్నా రిఁక
న్మానంబౌనెడ సంతసంబు నవమానం బైనచోఁ జింతయు
న్మానంబూని నిను న్భజించెద మదిన్ నాపైఁ బ్రసాదింపు మ
య్యా నీవే గతి నీపదాబ్జముల నే ధ్యానించెదన్ మాధవా.

23


శా.

నీ వావిష్ణుఁడ వంచుఁ దా నెఱుఁగమిన్ నీరేజగర్భుం డొగిన్
గోవత్సంబుల నాలఁ దాఁచఁ గను గో గోవత్సరూపంబులన్
నీవే దాల్పఁగ నబ్బురంబు పడి వాణీజాని నీస్తోత్రముం
గావించెంగద నీదుమాయ దెలియంగా శక్యమే మాధవా.

24


శా.

ధీచాంచల్యము దేవదానవుల కొందింపన్ జగన్మోహనం
బౌచున్నట్టి స్వరూపమెత్తి యమృతం బాదేవతారాజికిన్
బ్రాచుర్యంబుగ నిచ్చి రాక్షసులకున్ రాకుండఁగాఁ జేసితౌ
నీచర్యల్ మిగుల న్విచిత్రముగఁ గాన్పించుంగదా మాధవా.

25


మ.

ప్రకటంబై తగుమల్లయుద్ధ మరుదారన్ జేసి చాణూరము
ష్టికులం బట్టి వధించినాఁడ విఁక దుశ్శీలాన్వితుం గంసునిన్
వికటాకారుని సంహరించితివి పృథ్వి న్నీవు గోపాలబా
లకరూపంబున నున్న దేవుఁడవు నిన్ శ్లాఘించెదన్ మాధవా.

26