పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

524

భక్తిరసశతకసంపుటము


మ.

వికృతాకారిణి నాత్రివక్రను దయ న్వీక్షించి నీ వప్సరో
నికరం బెల్లను మెచ్చుకోఁదగినదానిం జేసితౌ ద్రౌపదీ
ముకురాస్యామణి కీవ నిర్మితములౌ పుట్టంబులం గూర్చి యా
మెకు మానంబును గాచినాఁడవు జను ల్మెచ్చంగ శ్రీమాధవా.

27


మ.

కొలువై తుంబురునారదాదులగు భక్తుల్ వల్లకీగాన ము
జ్జ్వలతన్ జేయఁ దదీయగోష్ఠిఁదగుచున్ వైకుంఠమందున్న నీ
యలఘుప్రాభవసంపదున్నతులఁ గన్నార న్విలోకించువా
రలకున్ మ్రొక్కినఁ బాపముల్ దొలఁగి దూరంబౌగదా మాధవా.

28


శా.

నీచారిత్రములం బఠింప శుభముల్ నెక్కొంచునుండున్ సదా
వాచాకౌశలిచేత నీదునుతులన్ వాక్రుచ్చిన న్వారి కౌ
రా చేకూరుచునుండెడి సకలతీర్థస్నానపుణ్యంబులున్
నీచే లోకము లుద్భవస్థితిలయాన్వీతంబులౌ మాధవా.

29


శా.

నీవక్షస్థలమందు బాలరవికాంతిం గేరఁగాఁజాలుచున్
ఠీవిన్ భాసిలునట్టి కౌస్తుభమణి న్వీక్షించిన న్వాఁడు మో
హావేశంబులఁ బాసి జ్ఞానకలితుండై మోక్షముం బాల్పడున్
దేవా నీవు ధరించు చిహ్నమయినన్ ని న్బోలు నో మాధవా.

30