పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

113


గీ.

ఎదురుగా వచ్చి శుక్రున కెలమి మ్రొక్కి
కలువరాయఁడు దనుజులఁ గౌఁగిలించి
వావివరుసలు మెఱయంగ వారు దాను
నెనసి క్షీరోదకన్యాయమున వసించె.

201


వ.

అనుటయు.

202


ఆశ్వాసాంతము

శా.

శ్రీరామానుజకీర్తిధారణ! రణశ్రీవేణిఖడ్గధా
రారాజత్కరపద్మ! పద్మహితకృద్రంగద్భుజాథామ ! ధా
మారామాంబుజవాసినీపదసముద్యన్నూపురారావదీ
ర్ణారాతిప్రభుకర్ణ! కర్ణశిబికల్పా! కల్పదానోదయా!

203


క.

ధారాళజయవిహారా!
హారాయతకీర్తికృతదిశాలంకారా!
కారావసదరివారా!
వారాశిశయానపాదభక్త్యాధారా.

204


తోటకవృత్తము.

కురుకరహాటకరూశవరాటకోసలభోజకళింగమహీ
వరనుతహాటకరత్నకవాటకవర్లితకూటక! దానజితా
మరతరువాటక! సద్గుణపేటిక! మర్ధితతాటక! సాత్కృతధీ
విరచితనాటక! దండకఝాటకవీంద్రకిరీటకళాకలితా!

205


గద్య.

ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానందకందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతం బైనశశాంకవిజయం బనుమహాప్రబంధమునందుఁ జతుర్థాశ్వాసము.