పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

శశాంక విజయము


ఉ.

లాలితరూపయౌవనకళారసధాముఁడు సోముఁ డర్థిమై
వేలుపుటొజ్జపజ్జ నొగి విద్యలు నేర్చుచు నుండ వానియి
ల్లా లొకచోటఁ దా నతని కంగజవిద్యలు నేర్పి సాహసో
ద్వేలతఁ జంద్రుఁ దోడ్కొని తదీయగృహంబున కేఁగె నంతటన్.

193


క.

ఆచందము వేవేగన్
వాచస్పతి వచ్చి తెలుప వాస్తోష్పతి దా
సైచఁగయేచిన కినుక
న్జూచి విధునిమీఁద సైన్యములతో వెడలెన్.

194


ఉ.

చందురుఁ డొక్కరుండు బహుసంగరకోవిదు లై కడంగుసం
క్రందనవహ్నిముఖ్యరథికప్రవరు ల్మఱి వేనవేలు వా
రందఱు నొక్కనిం బొదువునప్పు డుపేక్ష యొనర్పఁ బాడియే
యిందున కీవు బాసటయి యిందునకుం జయ మిమ్ము భార్గవా!

195


వ.

అనిన దరహాసభాసురముఖుండై శుక్రుం డిట్లనియె.

196


శా.

ఏమేమీ కడువింత వింటిమి బళీ! యిల్లాండ్రలోఁ దార బ
ల్సామే చంద్రుని ముఖ్యశిష్యునిగ నెంచంబోలు మా కింక సు
త్రామాదు ల్వడిఁ జుట్టుకొన్న శశిమీఁదన్ రేఖ గానిత్తునే
నామాహాత్మ్యముఁ జూడుమా గురుని నిందామగ్నుఁ గావించెదన్.

197


క.

సురసంయమివర! మీకున్
బెరిమన్ దృప్తిగను విందుఁ బెట్టించెద సం
గరమున మీరు నిజేచ్ఛా
పరతం జనుఁ డందుఁ బంచి భార్గవుఁ డంతన్.

198


క.

వృషపర్వాదిమహాసుర
వృషభుల రావించి చంద్రువిధముఁ దెలిపి యీ
విషమసమయంబునను నని
మిషులం గెల్తుమని నీతి మెఱయఁగ నంతన్.

199


క.

శీతాంశునిచెంతకు నొక
దూతం బనిపించి తాము దోడ్పడురీతుల్
ప్రీతి వినఁ జేసి దైత్యస
మేతముగా శుక్రుఁ డచటి కేతెంచుటయున్.

200